pakistan: పాకిస్థాన్ లో రైలులో పేలిన సిలిండర్.. ఇద్దరి మృతి

  • పెషావర్ నుంచి క్వెట్టాకు బయల్దేరిన ట్రైన్
  • చిచావత్ని రైల్వే స్టేషన్ వద్ద నాలుగో నంబర్ బోగీలో సిలిండర్ పేలుడు
  • నలుగురికి గాయాలు.. ఉగ్రకోణంలో దర్యాప్తు
pakistan jaffer express train blast 2 passengers died

పాకిస్థాన్ లో మరోసారి పేలుడు ఘటన చోటుచేసుకుంది. ట్రైన్ లో సిలిండర్ పేలడంతో ఇద్దరు ప్రయాణికులు చనిపోయారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈరోజు జాఫర్ ఎక్స్ ప్రెస్ రైలులో ఈ ఘటన జరిగింది. 

పెషావర్ నుంచి క్వెట్టాకు ట్రైన్ వెళ్తుండగా.. చిచావత్ని రైల్వే స్టేషన్ వద్ద నాలుగో నంబర్ బోగీలో సిలిండర్ పేలినట్లు పాకిస్థాన్ మీడియా వెల్లడించింది. సిలిండర్ ను ఓ ప్రయాణికుడు వాష్ రూమ్ కు తీసుకెళ్లినట్లు రైల్వే అధికార ప్రతినిధి చెప్పారని తెలిపింది.

ఈ ఘటనలో ఉగ్ర కోణం ఉందేమోనని అనుమానిస్తున్నారు. ఇప్పటికే రంగంలోకి దిగిన ఉగ్రవాద వ్యతిరేక శాఖ అధికారులు.. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. రైలు, ట్రాక్ మొత్తాన్ని పరిశీలించారు. పేలుడు జరిగిన ప్రాంతంలో ఆధారాలను సేకరిస్తున్నారు. 

పెషావర్ లోని మసీదులో జనవరి 30న జరిగిన ఆత్మాహుతి దాడిలో 100 మందికి పైగా చనిపోయిన విషయం తెలిసిందే. భారీ భద్రత ఉండే ప్రాంతంలోకి బైక్ పై పోలీసు దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాది తనను తాను పేల్చేసుకున్నాడు.

More Telugu News