us: అమెరికాలో మళ్లీ కాల్పుల కలకలం..!

Shooting at El Paso shopping mall in Texas kills 1 injures 3

  • టెక్సాస్‌లోని షాపింగ్‌ మాల్‌లో కాల్పులు
  • ఒకరి మృతి, ముగ్గురికి గాయాలు
  • పోలీసుల అదుపులో నిందితుడు
  • మరో అనుమానితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు

అమెరికాలో మళ్లీ తుపాకీ కలకలం రేగింది. టెక్సాస్‌లోని ఎల్‌పాసో నగరంలోగల సియెలో విస్టా షాపింగ్ మాల్‌లో బుధవారం రాత్రి కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఒకరు మరణించగా..ముగ్గురు గాయాలపాలయ్యారు. పోలీసులు ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నారు. మరో నిందితుడి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. నిందితులు కాల్పుల జరపడానికి కారణం ఏంటో ఇంకా తెలియరాలేదు. గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉందనేది కూడా పోలీసులు ఇంకా వెల్లడించలేదు. 

‘‘ప్రస్తుతం ఒకరిని అదుపులోకి తీసుకున్నాం. ఈ కాల్పుల వెనుక మరొకరు కూడా ఉండి ఉండొచ్చని భావిస్తున్నాం. షాపింగ్‌ మాల్‌లో విస్త్రతంగా గాలింపు చర్యలు చేపడుతున్నాం’’ అని ఎల్ పాసో పోలీసు డిపార్ట్‌మెంట్ ప్రతినిధి పేర్కొన్నారు. అంతేకాకుండా..మాల్, పరిసర ప్రాంతాలకు ప్రజలు రావద్దని కూడా హెచ్చరించారు. స్థానిక మీడియా కథనాల ప్రకారం.. మాల్‌లోని ఫుడ్ కోర్టు, డిల్లార్డ్స్ డిపార్ట్‌మెంటల్‌ స్టోర్లలో కాల్పులు జరిగాయి. ‘‘భయంతో ప్రజలు అటూ ఇటూ పరిగెడుతుండటం నేను చూశా’’ అని ఓ ప్రత్యక్ష సాక్షి మీడియాకు తెలిపారు. 

2019లో కాల్పులు జరిగిన వాల్‌మార్ట్‌ సూపర్ మార్కెట్‌కు పక్కనే ఉన్న సియెలో షాపింగ్ మాల్‌లో ఈ ఘోరం చోటుచేసుకోవడం గమనార్హం. నాటి ఘటనలో 23 మంది మరణించగా.. రెండు డజన్లకు పైగా గాయపడ్డారు.

us
  • Loading...

More Telugu News