Nadendla Manohar: విశాఖను రాజధానిగా ఎవరూ కోరుకోవడంలేదు: నాదెండ్ల మనోహర్

Nadendla Manohar says no one wants Visakha as capital
  • మరోసారి చర్చనీయాంశంగా ఏపీ రాజధాని అంశం
  • భిన్న వ్యాఖ్యలు చేస్తున్న వైసీపీ నేతలు
  • రాజధాని విషయంలో మంత్రుల మధ్యే సఖ్యత లేదన్న నాదెండ్ల
  • రాజధాని అజెండాతో ఎన్నికలకు వెళదాం అంటూ సీఎంకు సవాల్
జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఏపీ రాజధాని అంశంపై స్పందించారు. విశాఖను రాజధానిగా ఎవరూ కోరుకోవడంలేదని స్పష్టం చేశారు. విశాఖ రాజధాని అంశంపై ఉత్తరాంధ్రులకు నమ్మకం లేదని తెలిపారు. రాజధాని విషయంలో మంత్రుల మధ్యే సఖ్యత లేదని నాదెండ్ల విమర్శించారు. సీఎం జగన్ ను చాలెంజ్ చేస్తున్నాం... దమ్ముంటే రాజధాని అజెండాతో ఎన్నికలకు వెళదాం రండి అని స్పష్టం చేశారు. ఇంత దౌర్భాగ్యపు పాలన ఎక్కడా చూడలేదని అన్నారు. 

విశాఖలో ప్రభుత్వ కార్యాలయాలు పెట్టినంత మాత్రాన తమ జీవితాలు మారిపోతాయని ఉత్తరాంధ్ర ప్రజలు భావించడంలేదని తెలిపారు. రోడ్డు వేయలేని ఈ సీఎం ఉన్న రాజధానిని ఉద్ధరించలేకపోతున్నారని నాదెండ్ల మనోహర్ ఎద్దేవా చేశారు. 

"నేను విశాఖ వెళ్లిపోతున్నానని సీఎం అంటారు. ఒక మంత్రి విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని అంటారు. ఉత్తరాంధ్రకు చెంది ఓ మంత్రి ప్రత్యేక రాష్ట్రం కావాలంటాడు. ఈ విధంగా మీ రాజకీయ లబ్ది కోసం ప్రాంతాల మధ్య చిచ్చుపెడతారా?" అంటూ నాదెండ్ల మనోహర్ మండిపడ్డారు. 

చిత్తశుద్ధి ఉన్నవాళ్లయితే అమరావతితో పాటు విశాఖ, కర్నూలును ఒకే రీతిలో అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. అమరావతి ఒక్కటే ఏపీ రాజధాని అనేది జనసేన విధానమని స్పష్టం చేశారు.
Nadendla Manohar
Visakhapatnam
AP Capital
Janasena
YSRCP

More Telugu News