Chetan Sharma: టీమిండియాలో రెండు వర్గాలు ఉన్నాయన్న చీఫ్ సెలెక్టర్

BCCI Chief Selector reveals so many issues in Team India
  • ఓ టీవీ చానల్ స్టింగ్ ఆపరేషన్
  • పలు అంశాల్లో వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన చేతన్ శర్మ
  • రోహిత్ శర్మ, కోహ్లీ మధ్య ఇగో ఉందని వెల్లడి 
  • ఒక గ్రూపుకు రోహిత్, మరో గ్రూపుకు కోహ్లీ నాయకులని వ్యాఖ్యలు
ఓ టీవీ చానల్ చేపట్టిన స్టింగ్ ఆపరేషన్ లో బీసీసీఐ చీఫ్ సెలెక్టర్ చేతన్ శర్మ నోరు జారాడు. టీమిండియా ఆటగాళ్ల గురించి అనేక రహస్యాలు బట్టబయలు చేశాడు. 

టీమిండియాలో రెండు గ్రూపులు ఉన్నాయని, ఒక గ్రూపుకు రోహిత్ శర్మ, మరో గ్రూపుకు విరాట్ కోహ్లీ నాయకులు అని వెల్లడించాడు. రోహిత్ శర్మ, కోహ్లీ మధ్య ఇగో ఉందని, అయితే ఇద్దరి మధ్య సత్సంబంధాలే ఉన్నాయని చేతన్ శర్మ తెలిపాడు. కోహ్లీ ఫామ్ లో లేనప్పుడు రోహిత్ బాసటగా నిలిచాడని వివరించాడు.

ఇక, రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యాలకు తాను ఎంత చెబితే అంత అని, తనను వారిద్దరూ గుడ్డిగా నమ్ముతారని వెల్లడించాడు. 

అంతేకాదు... టీమిండియా క్రికెటర్లలో చాలామంది పూర్తి ఫిట్ తో ఉన్నట్టు కనిపించినా, అదంతా డొల్ల అని స్పష్టం చేశారు. ఫిట్ నెస్ కోసం ఇంజెక్షన్లు తీసుకుంటారని, దాంతో 80 శాతం ఫిట్ గా ఉన్నవారు కూడా 100 శాతం ఫిట్ గా ఉన్నట్టు కనిపిస్తారని చేతన్ శర్మ పేర్కొన్నాడు. బుమ్రా కూడా ఈ ఇంజెక్షన్లు తీసుకుని మ్యాచ్ లు ఆడాడని బాంబు పేల్చాడు. 

సరైన ప్రదర్శన చేయలేని టీమిండియా క్రికెటర్లు కొందరు ఈ ఇంజెక్షన్లు తీసుకుని బరిలో దిగిన సందర్భాలు ఉన్నాయని తెలిపాడు. ఈ ఇంజెక్షన్లలో డోప్ టెస్టుల్లో పట్టుబడని స్టెరాయిడ్లు ఉంటాయని వివరించాడు. 

ఇక, కోహ్లీ తనను తాను బీసీసీఐ కంటే అధికుడ్నని భావించేవాడని, కెప్టెన్సీ విషయంలో గంగూలీని నిందించాడని చేతన్ శర్మ వివరించాడు. టీ20 జట్టుకు కెప్టెన్సీ వదులుకుంటున్నప్పుడు తనను కొనసాగాలని గంగూలీ కోరలేదని కోహ్లీ భావించాడని, మీడియా సమావేశంలో దీనిపై కోహ్లీ పచ్చి అబద్ధం చెప్పాడని ఆరోపించాడు. 

కెప్టెన్సీ వదులుకుంటున్నట్టు కోహ్లీ ప్రకటించినప్పుడు... మరోసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని గంగూలీ చెప్పడం తాను విన్నానని చేతన్ శర్మ స్పష్టం చేశాడు. పరిమిత ఓవర్ల కెప్టెన్సీ పోవడానికి గంగూలీయే కారణమని కోహ్లీ బలంగా నమ్మాడని వెల్లడించాడు.
Chetan Sharma
Team India
Rohit Sharma
Virat Kohli
BCCI

More Telugu News