Air India: 220 బోయింగ్ విమానాలు కొనుగోలు చేయనున్న ఎయిరిండియా... చారిత్రాత్మక ఒప్పందమన్న బైడెన్

Air India set to buy 220 planes from Boeing
  • ఎయిర్ బస్ నుంచి 250 విమానాల కొనుగోలుకు ఒప్పందం
  • కొన్ని గంటల్లోనే బోయింగ్ తో మరో డీల్ కుదుర్చుకున్న ఎయిరిండియా
  • రూ.2.81 లక్షల కోట్లతో భారీ ఒప్పందం
  • 10 లక్షల మంది అమెరికన్లకు ఉపాధి లభిస్తుందన్న బైడెన్
టాటాల చేతుల్లోకి వెళ్లాక విస్తరణ బాటలో ఉన్న ఎయిరిండియా భారీ ఒప్పందాలతో ముందుకు వెళుతోంది. ఎయిర్ బస్ సంస్థ నుంచి ఎయిరిండియా 250 విమానాలకు భారీ ఒప్పందం కుదుర్చుకున్న కొన్ని గంటల్లోనే మరో మెగా డీల్ కార్యరూపం దాల్చింది. 

అమెరికాకు చెందిన బోయింగ్ సంస్థ నుంచి ఎయిరిండియా 220 విమానాలు కొనుగోలు చేసేందుకు ఒప్పందం ఖరారైందంటూ అమెరికా అధ్యక్ష భవం వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. 

భారత్ కు చెందిన అతిపెద్ద విమానయాన సంస్థ ఎయిరిండియాతో బోయింగ్ ఒప్పందం కుదరడం పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ హర్షం వ్యక్తం చేశారు. ఇది చారిత్రాత్మక ఒప్పందం అని అభివర్ణించారు. ఈ ఒప్పందంతో అమెరికాలోని 44 రాష్ట్రాల్లో 10 లక్షల మంది అమెరికన్లు ఉపాధి పొందుతారని వివరించారు. 

కాగా, ఈ డీల్ విలువ రూ.2.81 లక్షల కోట్లు. ఈ ఒప్పందంలో భాగంగా ఎయిరిండియా 190 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు, 10 బోయింగ్ 777ఎక్స్ విమానాలు కొనుగోలు చేయనుంది. 

ఎయిరిండియా మరో 50 బోయింగ్ 737 మ్యాక్స్ విమానాలు, 20 బోయింగ్ 787 విమానాలు కొనుగోలు చేసేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్టు తెలుస్తోంది.
Air India
Boeing
Planes
Joe Biden
USA
India
Airbus

More Telugu News