LTTE: ఎల్టీటీఈ ప్రభాకరన్ బతికే ఉన్నాడు.. త్వరలోనే బయటకు వస్తాడు: ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు నెడుమారన్

  • ప్రభాకరన్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నాడని తెలిపిన నెడుమారన్
  • ప్రభాకరన్ కు తమిళనాడు ప్రభుత్వం, తమిళ పార్టీలు, ప్రజలు అండగా ఉండాలని విన్నపం
  • ప్రభాకరన్ చనిపోయారంటూ 2009లో ప్రకటించిన లంక ఆర్మీ
LTTE Prabhakaran is alive says Nedumaran

ఎల్టీటీఈ అధినేత ప్రభాకరన్ ఇంకా బతికే ఉన్నారంటూ ప్రపంచ తమిళ సమాఖ్య అధ్యక్షుడు, కాంగ్రెస్ మాజీ నేత నెడుమారన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే ఆయన బయటకు వస్తారని ఈలం తమిళుల మెరుగైన జీవనం కోసం ఒక ప్రకటన చేయబోతున్నారని తెలిపారు. తంజావూరులో ముల్లివైక్కల్ మెమోరియల్ లో మీడియాతో ఆయన మట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. 

శ్రీలంకలో ప్రభుత్వంపై ఇటీవల చోటుచేసున్న ప్రజా తిరుగుబాటు, రాజపక్ష దేశాధ్యక్ష పదవికి రాజీనామా చేసి, విదేశాలకు పారిపోవడం వంటి పరిణామాల నేపథ్యంలో... ప్రభాకరన్ మళ్లీ బయటకు రావడానికి ఇదే సరైన సమయమని ఆయన చెప్పారు. ప్రభాకర్ కు ఈలం తమిళులు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తమిళులు సంపూర్ణ మద్దతును పలకాలని కోరారు. ప్రభాకర్ కు తోడుగా తమిళనాడు ప్రభుత్వం, తమిళ రాజకీయ పార్టీలు, తమిళనాడు ప్రజలు నిలవాలని అన్నారు.

కుటుంబ సభ్యులతో ప్రభాకరన్ టచ్ లో ఉన్నారని చెప్పారు. ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని తెలిపారు. అయితే ప్రభారన్ ఎక్కడ ఉన్నారనే ప్రశ్నకు బదులుగా... ఆ వివరాలను తాను ఇప్పుడు వెల్లడించలేనని చెప్పారు. మరోవైపు ప్రభాకరన్ చనిపోయారంటూ 2009 మే 18న శ్రీలంక ఆర్మీ ప్రకటించింది. ప్రభాకరన్ మృతదేహం ఫొటోలను కూడా విడుదల చేసింది. ప్రభాకరన్ కుమారుడు కూడా చనిపోయాడని తెలిపింది. ముల్లైతీవు ప్రాంతంలో శ్రీలంక సైన్యంతో జరిగిన పోరులో ప్రభాకరన్ చనిపోయారని వెల్లడించింది. ఈ నేపథ్యంలో, ఇన్నేళ్ల తర్వాత ప్రభాకరన్ బతికే ఉన్నారంటూ నెడుమారన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడులో కలకలం రేపుతున్నాయి.

More Telugu News