Turkey Earthquake: తుర్కియేలో అద్భుతం.. శిథిలాల్లో 128 గంటల తరువాత సజీవంగా 2 నెలల చిన్నారి

  • శిథిలాల కింద 128 గంటల పాటు సజీవంగా 2 నెలల చిన్నారి 
  • హతెయ్ ప్రాంతంలో వెలుగు చూసిన ఘటన 
  • స్థానికుల్లో వెల్లివిరిసిన ఆనందం
Miraculous Rescue In Turkey Baby Found Alive In Rubble After 128 Hours

దాదాపు ఇరవై ఎనిమిది వేల మరణాలు.. నేలమట్టమైన ఆరు వేల భవనాలు.. ఎటుచూసినా శిథిలాల కుప్పలు.. తుర్కియే(టర్కీ)-సిరియాల్లో భూకంపం మిగిల్చిన విషాదం ఇది. అయితే.. భూకంపం సంభవించి రోజులు గడుస్తున్నా కొందరు శిథిలాల కింద ప్రాణాలతో ఉండటం అక్కడి వారిలో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. 

హతెయ్ ప్రాంతంలో శనివారం శిథిలాల కిందున్న ఓ రెండు నెలల చిన్నారిని సహాయక సిబ్బంది కాపాడగలిగారు. భూకంపం సంభవించి 128 గంటల గడుస్తున్నా ఆ చిన్నారి శిథిలాల కింద సజీవంగా కనిపించడంతో అక్కడి వారి ఆనందానికి అంతేలేకుండా పోయింది. సిబ్బంది చిన్నారిని బయటకు తీసుకుని వస్తుండగా స్థానికులు పెద్ద ఎత్తున చప్పట్లు చరుస్తూ, ఈలలు వేస్తూ సంబర పడిపోయారు. 

టర్కీ మీడియా కథనాల ప్రకారం.. భూకంపం సంభవించి ఐదు రోజుల కావస్తున్నా కొందరు శిథిలాల కింద నుంచి ప్రాణాలతో బయటపడుతున్నారు. ఇటీవలే సహాయక సిబ్బంది రెండు సంవత్సరాల ఓ బాలికను రక్షించగలిగారు. అంతేకాకుండా.. ఆరు నెలల గర్భవతిని, 70 ఏళ్ల వృద్ధురాలినీ కాపాడారు. 

తుర్కియే, సిరియా భూకంపం..  ప్రపంచంలోనే  ఏడో అతి భారీ విపత్తుగా రికార్డుల్లోకి ఎక్కింది. తాజా లెక్కల ప్రకారం..తుర్కియే భూకంపం బారిన పడి 24,657 మరణించగా, సిరియాలో 3,500 మంది అసువులు బాసారు.

More Telugu News