Bangladesh: మ్యాచ్ జరుగుతుండగా డగౌట్‌లో దమ్ము కొడుతూ దొరికిపోయిన బంగ్లాదేశ్ దిగ్గజ క్రికెటర్.. వీడియో ఇదిగో!

Bangladesh legend caught smoking in dugout during live BPL Game
  • బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో ఘటన
  • మ్యాచ్ చూస్తూ సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కిన ఖాలెద్
  • తన ఆటగాళ్లకు ఏం నేర్పుతున్నాడంటూ విమర్శలు
  • ఎలాంటి చర్యలు తీసుకుంటారంటూ ప్రశ్నల వర్షం
మ్యాచ్ జరుగుతుండగా డగౌట్‌లో కూర్చుని మ్యాచ్ చూస్తున్న బంగ్లాదేశ్ మాజీ కెప్టెన్ దమ్ము కొడుతూ దొరికిపోయాడు. ప్రస్తుతం జరుగుతున్న బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్)లో జరిగిందీ ఘటన. బంగ్లాదేశ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అయిన ఖాలెద్ మహ్‌మూద్ ప్రస్తుతం బీపీఎల్‌లో ఖుల్నా టైగర్స్ ఫ్రాంచైజీకి కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. 

ఖుల్నా టైగర్స్-ఫార్చూన్ బరిషల్ మధ్య జరుగుతున్న మ్యాచ్‌ను డగౌట్‌లో కూర్చుని వీక్షిస్తున్న ఖాలెద్ సిగరెట్ తాగుతూ కెమెరాకు చిక్కి ఇబ్బందికరమైన పరిస్థితిలో చిక్కుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాకెక్కి వైరల్ అయింది. దిగ్గజ క్రికెటర్‌గా పేరు తెచ్చుకున్న ఖాలెద్ ఇలా సిగరెట్ తాగుతూ కనిపించడంపై అభిమానులు విరుచుకుపడ్డారు. 

ఐరోపాలో ఇలా దొరికితే ఆటగాళ్లను సస్పెండ్ చేస్తున్నారని, మరి ఖాలెద్‌పై ఎలాంటి చర్యలు తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అసలు డగౌట్‌లో ఉండగా సిగరెట్ తాగడం ఏంటంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. మైదానంలో సిగరెట్ తాగుతూ దొరికిన ఖాలెద్ తన ఆటగాళ్లకు ఆయన నేర్పుతున్నాడని మరికొందరు విరుచుకుపడుతున్నారు.  

కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఫార్చూన్ బరిషల్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. అనంతరం 170 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన ఖుల్నా టైగర్స్ మరో మూడు బంతులు మిగిలి ఉండగానే నాలుగు వికెట్లు మాత్రమే కోల్పోయి విజయాన్ని అందుకుంది.
Bangladesh
BPL
Khaled Mahmud
Khulna Tigers

More Telugu News