Brahmacharigala Padayatre: అమ్మాయిలు దొరకడం లేదట.. ‘పెళ్లి కాని ప్రసాదుల’ పాదయాత్ర!

Bachelors in found a unique solution to their bride crisis
  • కర్ణాటకలోని మాండ్యాలో ఘటన
  • జీవితంలో బాగా స్థిరపడినా కాని పెళ్లిళ్లు
  • శివుడి వద్దకు పాదయాత్రకు సిద్ధమైన బ్యాచిలర్స్
  • 23న ప్రారంభం కానున్న పాదయాత్ర

వాళ్లందరికీ ఒక్కొక్కరికీ పదెకరాలకు పైగానే భూములున్నాయి. ఏడాదికి మూడు పంటలు పండిస్తూ బాగానే సంపాదిస్తున్నారు. అయినా సరే వారిని ఓ బాధ వేధిస్తోంది. పెళ్లి చేసుకునేందుకు అమ్మాయిలే దొరకడం లేదు. వయసొచ్చి మీదపడుతున్నా వివాహ ఘడియలు రాకపోవడంతో తెగ ఫీలైపోతున్న దాదాపు 200 మంది యువకులు తమకు పెళ్లిళ్లు జరిగేలా చూడాలంటూ శివాలయానికి పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. 

కర్ణాటకలోని మాండ్యా జిల్లాకు చెందిన యువకులందరూ కలిసి ప్రముఖ శైవక్షేత్రమైన మలెమహదేవన బెట్టకు పాదయాత్రగా వెళ్లేందుకు సిద్ధమయ్యారు. మాండ్య నుంచి 105 కిలోమీటర్ల దూరంలో చామరాజనగర జిల్లాలోని బెట్టకు ఈ నెల 23న వీరి పాదయాత్ర ప్రారంభం కానుంది. 

మాండ్యా జిల్లాలోని మద్దూరు తాలూకా కేఎందొడ్డి చుట్టుపక్కల గ్రామాలకు చెందిన ఈ యువకుల వయసు 30-34 ఏళ్లు. వీరందరూ శ్రీమంతులే. ఒక్కొక్కరికీ పదెకరాలకుపైగానే పంట భూములున్నాయి. ఏడాదికి మూడు పంటలు వేస్తూ బాగానే సంపాదిస్తున్నారు. జీవితంలో స్థిరపడినా వివాహాలు జరగకపోవడంతో బ్రహ్మచారులుగా మిగిలిపోతున్నారు.

స్త్రీ, పురుష నిష్పత్తిలో తేడా, ఇతర ప్రాంతాల వారు పిల్లను ఇచ్చేందుకు ముందుకు రాకపోవడంతో ఆయా గ్రామాల్లోని యువకులకు పెళ్లిళ్లు జరగడం కష్టంగా మారింది. ఇలాగైతే లాభం లేదని, తమ ఆవేదనను అర్థం చేసుకునేది ఒక్క శివుడేనని భావించిన వీరందరూ ఒక్కటయ్యారు. ‘బ్రహ్మచారుల పాదయాత్ర’ పేరిట యాత్ర చేస్తున్నట్టు ప్రకటించగానే బెంగళూరు, మైసూరు, మాండ్య, శివమొగ్గ జిల్లాల నుంచి 100 మంది పేర్లు నమోదు చేసుకున్నారు. మొత్తంగా 200 మంది అయ్యారు.

ఈ నెల 23న వీరి పాదయాత్ర ప్రారంభం  కానుంది. యాత్రలో పాల్గొనేవారు ఖర్చును సమానంగా భరించాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడీ పాదయాత్ర హాట్ టాపిక్‌గా మారింది. మరి ఈ యాత్ర తర్వాతైనా వీరికి వివాహాలవుతాయో? లేదో? చూడాలి.

  • Loading...

More Telugu News