Chiranjeevi: ఓసారి పవన్ ను రైల్వే స్టేషన్ లో ఆపేశారు: చిరంజీవి

  • గాయని స్మిత హోస్ట్ గా నిజం టాక్ షో
  • హాజరైన చిరంజీవి
  • ఇతరుల బాధలకు స్పందించే గుణం పవన్ లో ఉందని వెల్లడి
  • పవన్ తనకు రాజకీయ నేతగానే నచ్చుతాడన్న మెగాస్టార్
Chiranjeevi opines about his brother Pawan Kalyan

ప్రముఖ గాయని స్మిత హోస్ట్ గా వ్యవహరిస్తున్న నిజం కార్యక్రమానికి చిరంజీవి హాజరయ్యారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఇతరులకు సాయం చేయాలన్న గుణం పవన్ కల్యాణ్ లో బాల్యం నుంచే ఉందని వెల్లడించారు. ఇతరుల బాధలకు పవన్ స్పందించేవాడని తెలిపారు. ఓ దశలో పవన్ నక్సల్స్ లో చేరతాడని భావించామని తెలిపారు. 

పవన్ కు తుపాకులంటే ఇష్టమని, వాటితో ఆడుకునేవాడని చిరంజీవి వివరించారు. "ఓసారి సింగపూర్ షూటింగ్ కు వెళుతున్నాను. అక్కడ్నించి ఏం తీసుకురమ్మంటావు అని పవన్ ను అడిగాను. ఇక్కడ సరైన తుపాకులు దొరకడంలేదు... అక్కడ మంచి తుపాకులు దొరికితే తీసుకురా అన్నయ్యా అని చెప్పాడు. 

ఓసారి తుపాకులు పట్టుకుని తిరుగుతుంటే రైల్వే స్టేషన్ లో ఆపారు. అయితే అవి డమ్మీ తుపాకులు కావడంతో వదిలిపెట్టారు. పవన్ కు ఉన్న కల్ట్ ఇమేజ్ ఇతరులతో పోల్చితే భిన్నమైనది. అందరికీ అభిమానులు ఉంటే పవన్ కు భక్తులు ఉంటారు" అని చిరంజీవి వివరించారు. 

పవన్ నటుడిగా ఇష్టమా, రాజకీయ నాయకుడిగా ఇష్టమా అన్న ప్రశ్నకు చిరంజీవి పైవిధంగా జవాబిచ్చారు. పవన్ సహజ స్వభావాన్ని బట్టి చూస్తే రాజకీయ నేతగానే ఇష్టం అని మెగాస్టార్ స్పష్టం చేశారు.

More Telugu News