turkey: టర్కీలో శిథిలాల కింద 10 రోజుల పసికందు.. 90 గంటల తర్వాత కాపాడిన రెస్క్యూ బృందాలు

  • మృత్యుంజయులై బయటపడుతున్న చిన్నారులు
  • భూకంపం కారణంగా నిరాశ్రయులుగా మారిన లక్షలాది మంది 
  • టర్కీ, సిరియాలలో 25 వేలు దాటిన మృతుల సంఖ్య
10 days old infant and his mother rescued after 90 hours in turkey

భూకంపం ధాటికి టర్కీ (తుర్కియే) లో నేలకూలిన బిల్డింగ్ శిథిలాల కింది నుంచి చిన్నారులు మ‌ృత్యుంజయులై బయటపడుతున్నారు. రోజుల పసికందుల నుంచి పది పన్నెండేళ్ల పిల్లలను రెస్క్యూ బృందాలు కాపాడుతున్నాయి. తాజాగా హతయ్ ప్రావిన్సులో ఓ బిల్డింగ్ శిథిలాల కింది నుంచి పది రోజుల పసికందును తల్లితో సహా రెస్క్యూ సిబ్బంది రక్షించారు. శిథిలాల్లో చిక్కుకున్నతర్వాత 90 గంటలకు ఆ తల్లీబిడ్డలు క్షేమంగా బయటపడ్డారు.

సహాయక చర్యలు చేపట్టిన సిబ్బందికి పిల్లాడి ఏడుపు వినిపించడంతో అలర్టయ్యారు. జాగ్రత్తగా శిథిలాలను తొలగిస్తూ పసికందు దగ్గరికి చేరుకున్నారు. బాబుతో పాటు తల్లిని సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. దాదాపు నాలుగు రోజులు చిక్కుకుపోయిన తల్లీబిడ్డలను వెంటనే ఆసుపత్రికి తరలించారు. బాబు చురుగ్గానే ఉన్నప్పటికీ తల్లి మాత్రం తిండి, నీరు లేక నీరసించిపోయిందని వైద్యులు చెప్పారు.

టర్కీ, సిరియాలలో ఈ నెల 6న పెను భూకంపం సంభవించింది. దీంతో రెండు దేశాల్లో భారీ విధ్వంసం జరిగింది. ప్రాణనష్టం విపరీతంగా ఉందని అధికారులు తెలిపారు. రోజురోజుకూ మృతుల సంఖ్య పెరుగుతోందని వివరించారు. శుక్రవారం ఉదయం నాటికి టర్కీ, సిరియాలలో భూకంప మృతుల సంఖ్య 25 వేలు దాటిందని, శిథిలాల కింద ఇప్పటికీ చాలామంది చిక్కుకుపోయారని అధికారులు వివరించారు. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. భూకంపం కారణంగా ఇల్లు, వాకిలి కోల్పోయి లక్షలాది మంది నిరాశ్రయులగా మారారు.

More Telugu News