NRI: అమెరికా నుంచి పంపించేస్తారనే భయం.. ఇంట్లోంచి పారిపోయిన 14 ఏళ్ల భారతీయ బాలిక..!

  • ఆర్కాన్సాస్ రాష్ట్రంలో భారతీయ బాలిక 3 వారాలుగా అదృశ్యం
  • టెక్ రంగంలో తొలగింపులతో బాలిక కుటుంబంలో ఒత్తిడి
  • తండ్రికి జాబ్ పోవచ్చని బాలిక ఆందోళన 
  • అమెరికా వీడాల్సి వస్తుందనే భయంతో పారిపోయినట్టు పోలీసుల అనుమానం
Indian Teen Missing In US Fled Home Fearing Fathers Sacking Deportation

అమెరికాలో ఆర్కాన్సాస్ రాష్ట్రంలో భారతీయ బాలిక అదృశ్యమైన ఘటనలో తాజాగా మరో కోణం వెలుగులోకి వచ్చింది. తన కుటుంబాన్ని అమెరికా నుంచి పంపించేస్తారనే భయంతోనే బాలిక ఇంట్లోంచి పారిపోయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. టెక్ రంగంలో తొలగింపుల కారణంగా బాలిక తండ్రి తన ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి రావడంతో చిన్నారి ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు. అమెరికాలో వలసేతర వీసాదారులు ఉద్యోగం కోల్పోతే దేశాన్ని వీడాలన్న విషయం తెలిసిందే.

రాష్ట్రంలోని కాన్వే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల తన్వీ మారుపల్లి గత నెల 17న అదృశ్యమైంది. స్కూల్‌కు వెళ్లేందుకు బస్సు కోసం బయటకు వచ్చిన ఆమె ఆ తరువాత కనిపించకుండా పోయిందని కాన్వే పోలీస్ డిపార్ట్‌మెంట్ పేర్కొంది. అమెరికాలో తమ భవిష్యత్తు సందిగ్ధంలో పడటంతో  తన్వీ పారిపోయి ఉండొచ్చని ఆమె తల్లిదండ్రులు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న తమకు ఇంతవరకూ పౌరసత్వం లభించలేదని తెలిపారు. 

తన్వీ తండ్రి పవన్ మారుపల్లి టెక్ రంగంలో ఉన్నారు. ఐటీ రంగంలోని లేఆఫ్స్‌తో ఇటీవల ఆ కుటుంబంలో ఒత్తిడి నెలకొంది. అయితే.. ప్రస్తుతం తన ఉద్యోగానికి వచ్చిన ఇబ్బందేమీ లేదని ఆయన స్థానిక మీడియాకు తెలిపారు. దేశాన్ని వీడాల్సి వస్తుందన్న ఆందోళన తమకు లేదని స్పష్టం చేశారు. 

అమెరికాలో ఇప్పటివరకూ 2 లక్షల మంది ఐటీ ఉద్యోగులు తమ ఉపాధి కోల్పోయారు. వీరిలో 30 నుంచి 40 శాతం మంది భారతీయులేనని ఓ అంచనా. భారతీయుల్లో అధిక శాతం.. హెచ్-1 లేదా ఎల్-1 లాంటి వలసేతర వీసాలపై అమెరికాలో ఉంటున్నారు. ఉద్యోగం కోల్పోయిన పక్షంలో అమెరికాను వీడాల్సిన గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

NRI

More Telugu News