Seri Subash Reddy: వేగం 60 కిలోమీటర్లు దాటితే చలానాలు బాదేస్తున్నారన్న బీఆర్ఎస్ శాసనమండలి సభ్యుడు సుభాష్‌రెడ్డి.. తామూ బాధితులమేనన్న మిగతా సభ్యులు

  • శాసన మండలి ప్రశ్నోత్తరాల సమయంలో సుభాష్‌రెడ్డి ప్రస్తావన
  • వేగ పరిమితిని 85-90 కిలోమీటర్లకు పెంచాలని డిమాండ్
  • కఠినంగా వ్యవహరిస్తున్న మాట నిజమేనన్న హోంమంత్రి మహమూద్ అలీ
BRS Member Seri Subash Reddy Questions On E Challans

హైవేపై ప్రయాణిస్తూ వేగం 60 కిలోమీటర్లు దాటితే చలానాలు బాదేస్తున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు శేరి సుభాష్‌రెడ్డి శాసనమండలిలో చేసిన వ్యాఖ్యలకు ఇతర సభ్యులు వంత పాడారు. తామూ ఆ బాధితులమేనని ఆవేదన వ్యక్తం చేశారు. నిన్న ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడుతూ.. జాతీయ రహదారులపై 60 కిలోమీటర్ల వేగం దాటితే అధిక వేగం కింద ఈ-చలానాలు నమోదవుతున్నాయని పేర్కొన్నారు. తన వాహనంపై ఇలాంటి చలానాలు చాలానే ఉన్నాయని అన్నారు. కాబట్టి వేగ పరిమితిని 85-90 కిలోమీటర్లకు పెంచాలని కోరారు. 

సుభాష్‌రెడ్డి తెచ్చిన ఈ ప్రస్తావనకు ఇతర సభ్యులు కూడా వంతపాడారు. తాము కూడా ఈ-చలానాల బాధితులమేనని వాపోయారు. దీంతో కల్పించుకున్న హోంమంత్రి మహమూద్ అలీ వారికి సమాధానమిస్తూ.. అధికవేగం, డ్రంకెన్ డ్రైవ్, రాంగ్ సైడ్ డ్రైవింగ్, ఓవర్‌లోడింగ్ వంటివి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతున్నాయని, కాబట్టే కఠినంగా వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. 

గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సిగ్నలింగ్ వ్యవస్థను ఐరోపా దేశాల తరహాలో ఐటీఎంఎస్ ప్రాజెక్టు కింద మార్చుతున్నట్టు తెలిపారు. దీనివల్ల హైదరాబాద్ రోడ్లపై సగటు వేగం 22 కిలోమీటర్ల నుంచి 27 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. మరో ప్రశ్నకు సమాధానంగా మాట్లాడుతూ.. తెలంగాణలో సైబర్ మోసాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువమంది ఇతర రాష్ట్రాలకు చెందిన వారేనని తెలిపారు. వీరిని అడ్డుకునేందుకు సైబర్ సెక్యూరిటీ బ్యూరోను ఏర్పాటు చేసినట్టు హోంమంత్రి వివరించారు.

More Telugu News