Harish Rao: మా బడ్జెట్‌లో సకల జనుల సంక్షేమం ఉంది : అసెంబ్లీలో మంత్రి హరీశ్‌రావు

  • తమ బడ్జెట్ లో సకల జనుల సంక్షేమం ఉందన్న హరీశ్ రావు
  • గతంలో అసెంబ్లీకి ఖాళీ బిందెలతో వచ్చే వారమని వ్యాఖ్య
  • ఇప్పుడు రాష్ట్రంలో మంచి నీటి సమస్యే లేదన్న హరీశ్
Our budget is poor peoples budget says Harish Rao

విపక్షాలపై తెలంగాణ మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. నిండు పున్నమిలో ఉన్న చందమామ వెలుగులు చూడాల్సింది పోయి... ఆ చందమామ మీద ఉన్న మచ్చలను వెతికే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. శాసనసభలో ఆయన మాట్లాడుతూ... రాష్ట్ర బడ్జెట్ లో సింహభాగాన్ని పేదలు, బడుగు, బలహీన వర్గాల కోసం కేటాయించామని చెప్పారు. 

పేదలకు ఏమీ చేయకూడదు అనే భావం బీజేపీ, కాంగ్రెస్ నేతల మాటల్లో తెలుస్తోందని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచనల మేరకు తయారు చేసిన బడ్జెట్లో వృద్ధులకు రక్షణ ఉందని, పసిపిల్లలకు పోషణ ఉందని, బడి పిల్లలకు శిక్షణ ఉందని, ఉన్నత విద్యకు ఉపకారం ఉందని, యువతకు ఉద్యోగ కల్పన ఉందని, ఆరిపోని కరెంటు వెలుగులు ఉన్నాయని చెప్పారు. తమ బడ్జెట్ లో సకల జనుల సంక్షేమం ఉందని అన్నారు.


బడ్జెట్ లో నదీ జలాలను ఎత్తిపోసే విజయాలు, జలరాశుల గలగలలు, చెరువుల తళతళలు, చెరువుల్లో చేప పిల్లల మిలమిలలు, ధాన్య రాశుల కళకళలు, రైతుల చిరునవ్వులు, గొర్రెల మందల అరుపులు, ఆకుపచ్చని అడవులు, దళితబంధు ఇచ్చే దిలాసా, పేదింటి ఆడపిల్లల పెళ్లిపందిళ్లు, వారి తల్లిదండ్రుల కళ్లలో ఆనందబాష్పాలు ఉన్నాయని హరీశ్ అన్నారు.        

గతంలో రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడు ప్రారంభమైనా ట్యాంక్ బండ్ దగ్గరున్న అంబేద్కర్ విగ్రహం నుంచో, తెలంగాణ అమరవీరుల స్తూపం నుంచో ఖాళీ బిందెలతో అసెంబ్లీకి వచ్చే వాళ్లమని... తాగునీటి ఎద్దడి మీద విపక్షాలన్నీ వాయిదా తీర్మానం ఇచ్చేవని చెప్పారు. ఇప్పుడు మిషన్ బగీరథ వచ్చిన తర్వాత ఏరోజైనా కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క కానీ, ఇతర విపక్ష సభ్యులు కానీ తాగునీటి ఎద్దటిపై తీర్మానాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. అంటే... రాష్ట్రంలో మంచినీటి సమస్య లేదని ఒప్పుకున్నట్టే కదా? అని అన్నారు.

More Telugu News