Perni Nani: కొల్లు రవీంద్ర.. బందరు కమలహాసన్: పేర్ని నాని విసుర్లు

perni nani satirical comments tdp kollu ravindra
  • టీడీపీ నేత కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగనీతులేనన్న పేర్ని నాని
  • వాళ్లే కేసులు పెట్టించుకుని.. బెయిల్ వస్తే ఊరేగింపులు చేసుకుంటారని ఎద్దేవా
  • మచిలీపట్నంలో టీడీపీ ఆఫీసుకు ప్రభుత్వ భూమి లీజుకివ్వమని అడిగింది రవీంద్ర కాదా? అని ప్రశ్న
టీడీపీ నేత కొల్లు రవీంద్ర చెప్పేవన్నీ శ్రీరంగనీతులేనని వైసీపీ మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. బందరులో రవీంద్ర నటన ముందు కమలహాసన్, ఎస్వీ రంగారావు కూడా దిగదుడుపేనని ఎద్దేవా చేశారు. ఉద్దేశపూర్వకంగా పోలీసులపై ఆయన దాడి చేశారని, సానుభూతి రాజకీయాల కోసమే ఇదంతా చేస్తున్నారని విమర్శించారు. 

‘‘డ్రామాలు చేసి.. దాడులు చేసి.. కేసులు పెట్టించుకుని.. బెయిల్ వస్తే ఊరేగింపులు చేసుకుంటారు. పదవి ఉన్నప్పుడు పనిచేయరు.. పదవి పోగానే ఇలాంటి దిక్కుమాలిన డ్రామాలాడతారు’’ అని మండిపడ్డారు. 

‘‘ప్రభుత్వ ఆస్తులపై ముందు కన్నేసింది ఎవరు? హైదరాబాద్ నడిబొడ్డున టీడీపీ ఆఫీస్ ఉన్న స్థలం ప్రభుత్వ భూమి కాదా? మంగళగిరిలో టీడీపీ ఆఫీస్ ఉన్న స్థలం ఎవరిది? ప్రభుత్వానిది కాదా?’’ అని ప్రశ్నించారు. అసత్యాలు.. మోసాలు.. డ్రామాలు చేసే జన్మ అవసరమా? అని విమర్శించారు. కొల్లు రవీంద్ర బందరు కమల హాసన్ అంటూ పేర్ని నాని ఎద్దేవా చేశారు. 

మచిలీపట్నంలో టీడీపీ కార్యాలయానికి 50 సెంట్ల ప్రభుత్వ భూమి లీజుకి ఇవ్వమని అడిగింది రవీంద్ర కాదా? అని ప్రశ్నించారు. టీడీపీ కార్యాలయానికి స్థలం అడిగి.. ఇప్పుడు కబుర్లు చెబుతున్నారని మండిపడ్డారు. కొల్లు రవీంద్ర లాంటి వ్యక్తుల కారణంగా రాజకీయ నాయకుల విలువలు దిగజారిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Perni Nani
Kollu Ravindra
TDP
YSRCP

More Telugu News