vitamins: ఆరోగ్యం కోసం వాడుకోతగిన సప్లిమెంట్లు

  • నేటి ఆహార, జీవన అలవాట్లలో మార్పులు
  • కొన్ని రకాల ఆరోగ్య సమస్యలతో పోషకాల లేమి
  • ఇటువంటి వారు వైద్యుల సలహాతో సప్లిమెంట్లు తీసుకోవడం ఎంతో అవసరం
Common diseases and how to prevent them with the help of supplements

పోషకాల లేమి సమస్య నేడు ప్రపంచవ్యాప్తంగా ఉంది. అభివృద్ధి చెందుతున్న మన దేశంలోనూ ఎక్కువ మంది ప్రజలు పోషకాలలేమితో బాధపడుతున్నారు. నేటి జీవనశైలి, ఆహార అలవాట్లు మారిపోయాయి. ఇది కూడా పోషకలేమికి ప్రధాన కారణం. పోషకాలతో కూడిన ఆహారంతో ఎన్నో రకాల అనారోగ్యాలను దూరంగా ఉంచుకోవచ్చు. ఇందుకోసం వైద్యుల సూచనలతో సప్లిమెంట్లను తీసుకోవచ్చు. మల్టీ విటమిన్లు, మినరల్స్, ప్రోబయాటిక్స్, బొటానికల్ కాంపౌండ్ల (వనమూలికలు) మిశ్రమంగా ఆహారం ఉండాలి. వీటి ప్రయోజనాలు ఓ సారి గమనించినట్టయితే..

ప్రో బయాటిక్స్
ప్రోబయాటిక్స్ అంటే సూక్ష్మక్రిములు. ఆహారం చక్కగా జీర్ణమయ్యేందుకు ఇవి అవసరం. మన పేగుల్లో మంచి, చెడు అనే బ్యాక్టీరియా ఉంటుంది. దీని మధ్య చక్కని సమతుల్యత ఉన్నప్పుడే మనకు మంచి జరుగుతుంది. ప్రోబయాటిక్స్ సప్లిమెంట్లతో పేగుల్లో మంచి, చెడు బ్యాక్టీరియాల మధ్య సమతుల్యం ఏర్పడుతుంది. వీటితో పేగుల్లో బ్యాక్టీరియా వృద్ధి చెంది జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గిపోతాయి.

మల్టీ విటమిన్లు, మినరల్స్
మన శరీరంలో ఎన్నో జీవక్రియలు సజావుగా జరిగేందుకు విటమిన్లు, మినరల్స్ కూడా కావాలి. విటమిన్ ఏ, సీ, డీ, ఈ, కే, బీ కాంప్లెక్స్, ఫోలిక్ యాసిడ్ తోపాటు బీటా కెరోటిన్, కాపర్, పొటాషియం, జింక్, క్యాల్షియం, ఐయోడిన్, ఐరన్, మెగ్నీషియం లోపం లేకుండా చూసుకోవాలి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని ఇవ్వడంతోపాటు వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. అయితే, మాల్ అబ్జార్పక్షన్ సమస్యతో బాధపడేవారికి సప్లిమెంట్లే కీలకం. అంటే తీసుకున్న ఆహారం నుంచి పోషకాలన్నీ శరీరానికి అందకుండా కొన్ని రకాల సమస్యలు అడ్డుపడతాయి.  కొలైటిస్, గ్యాస్ట్రైటిస్, ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్ (ఐబీఎస్), ఐబీడీ వంటి సమస్యల్లో పోషకాలు శరీరానికి అందవు. వారికి సప్లిమెంట్లే ఆధారం. 

బొటానికల్ కాంపౌండ్లు
బొటానికల్ కాంపౌండ్ల మిశ్రమంతో కూడినవి వ్యాధి నిరోధక శక్తికి ఎంతో బలాన్నిస్తాయి. ఎథినేసియా, అల్లం, కెఫైన్, పసుపు, ఇవన్నీ ఇన్ ఫ్లమ్మేషన్ (వాపు గుణం) తగ్గిస్తాయి. రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. వీటిల్లో ముఖ్యంగా ఎథినేసియా వ్యాధి నిరోధక శక్తికి బలాన్నిస్తుంది. అల్లం వాపు గుణాన్ని తగ్గిస్తుంది.

More Telugu News