Ali: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడంపై మరోసారి స్పందించిన అలీ

Ali reiterates about poll contest
  • గత ఎన్నికల వేళ వైసీపీలో చేరిన అలీ
  • ఇటీవల ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియామకం
  • రాజమండ్రిలో క్రికెట్ టోర్నీ ప్రారంభించిన అలీ
  • పార్టీ అధినేత ఆదేశాల ప్రకారం ఎన్నికల్లో పోటీ
గత ఎన్నికల సమయంలో వైసీపీలో చేరిన టాలీవుడ్ కమెడియన్ అలీ ఇటీవల ఏపీ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుగా నియమితుడవడం తెలిసిందే. తాజాగా అలీ రాజమండ్రిలో ఓ క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభోత్సవానికి విచ్చేశారు.

ఈ సందర్భంగా ఆయనను మీడియా పలకరించింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై ప్రశ్నించగా, గతంలో చెప్పిన విధంగానే తమ పార్టీ అధినేత ఎక్కడ్నించి పోటీ చేయమంటే అక్కడ బరిలో దిగుతానని స్పష్టం చేశారు. 

రాజమండ్రి నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది కదా అని మీడియా వివరణ కోరగా... ఎక్కడి నుంచి పోటీ చేస్తాం అనే దానిపై ఊహాగానాలు రావడం మామూలేనని అన్నారు. 

రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీ మైదానంలో ఏడు రాష్ట్రాల జట్లతో ఆర్పీఎల్ క్రికెట్ టోర్నీ నిర్వహిస్తున్నారు. ఈ టోర్నీ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అలీకి ఘనస్వాగతం లభించింది. అలీపై పూలవర్షం కురిపించారు. క్రికెట్ బ్యాట్ చేతబట్టి కొన్ని బంతులు ఆడిన అలీ... ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజీలో ఈ టోర్నీ జరగడం సంతోషదాయకమని తెలిపారు. 

ఈ టోర్నీలో పాల్గొంటున్న ఆటగాళ్లు మెరుగ్గా ఆడి, ఆర్పీఎల్ స్థాయి నుంచి ఐపీఎల్ స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. అంతేకాదు, రాజమండ్రి ఆర్ట్స్ కాలేజి సినిమా షూటింగ్ లకు ప్రసిద్ధి చెందిందని, ఆ కాలేజీలో కొన్ని వందల చిత్రాలు చిత్రీకరణ జరుపుకున్నాయని అలీ వెల్లడించారు. అంతేకాదు, తన రెండో చిత్రం షూటింగ్ కూడా ఇక్కడికి సమీపంలోనే జరిగిందని గుర్తు చేసుకున్నారు.
Ali
Elections
YSRCP
Andhra Pradesh

More Telugu News