rbi: అదానీ సంస్థల అవకతవకల వార్తల నేపథ్యంలో.. భారత బ్యాంకింగ్ రంగంపై ఆర్బీఐ కీలక ప్రకటన

Banking sector stable says RBI on banks exposure to Adani Group
  • ప్రస్తుతం భారత బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉందని స్పష్టీకరణ
  • బ్యాంకింగ్ సెక్టార్, వ్యక్తిగత బ్యాంకులపై నిరంతరం నిఘా ఉంచుతామని వెల్లడించిన ఆర్బీఐ
  • హిండెన్ బర్గ్ నివేదికతో భారీగా పతనం అవుతున్న అదానీ గ్రూప్ షేర్లు
ప్రముఖ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ సంస్థల్లో ఆర్థిక అవకతవకలు జరిగాయంటూ అమెరికాకు చెందిన హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత భారత స్టాక్ మార్కెట్లలో అలజడి నెలకొంది. దీనివల్ల భారత బ్యాంకింగ్ రంగం కూడా తీవ్ర ప్రభావానికి గురవుతుందన్న వార్తల నేపథ్యంలో భారత రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) స్పందించింది. స్టార్ మార్కెట్లో అదానీ గ్రూప్ షేర్లు పతనం అవుతున్నప్పటికీ దేశంలోని బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉందని ఆర్బీఐ స్పష్టం చేసింది. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పేర్కొంది. ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించడానికి బ్యాంకింగ్ సెక్టార్‌పై, వ్యక్తిగత బ్యాంకులపై ఆర్బీఐ నిరంతరం నిఘా ఉంచుతుందని తెలిపింది. అయితే, తన ప్రకటనలో అదానీ గ్రూపు పేరును పేర్కొనలేదు.

‘ఒక వ్యాపార సంస్థకు సంబంధించిన విషయంలో భారతీయ బ్యాంకుల గురించి ఆందోళన వ్యక్తం చేస్తూ మీడియా నివేదికలు ఉన్నాయి. బ్యాంకుల రెగ్యులేటర్, సూపర్‌ వైజర్‌గా ఆర్థిక స్థిరత్వాన్ని కొనసాగించే ఉద్దేశ్యంతో బ్యాంకింగ్ రంగం, వ్యక్తిగత బ్యాంకులపై ఆర్బీఐ నిఘా ఉంచుతుంది. ఆర్బీఐ వద్ద సెంట్రల్ రిపోజిటరీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఆన్ లార్జ్ క్రెడిట్స్ డేటాబేస్ సిస్టమ్ ఉంది. ఇది బ్యాంకులు రూ.5 కోట్లు అంతకంటే ఎక్కువ లావాదేవీలను నివేదిస్తాయి. ఇది పర్యవేక్షణ ప్రయోజనాల కోసం ఉపయోగపడుతుంది. ఆర్బీఐ ప్రస్తుత అంచనా ప్రకారం, బ్యాంకింగ్ రంగం నిలకడగా, స్థిరంగా ఉంది. మూలధన సమృద్ధి, ఆస్తి నాణ్యత, లిక్విడిటీ, లాభదాయకతకు సంబంధించిన వివిధ ప్రమాణాలు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయి. బ్యాంకులు కూడా ఆర్బీఐ జారీ చేసిన లార్జ్ ఎక్స్‌పోజర్ ఫ్రేమ్‌వర్క్ మార్గదర్శకాలను అనుసరిస్తున్నాయి. ఆర్బీఐ అప్రమత్తంగా ఉంటూ భారతీయ బ్యాంకింగ్ రంగం స్థిరత్వాన్ని పర్యవేక్షిస్తూనే ఉంది’ అని తన ప్రకటనలో పేర్కొంది. 

ఇదిలాఉండగా, అదానీ గ్రూప్ నష్టాల నేపథ్యంలో ఆ సంస్థలకు ఇచ్చిన రుణాలకు సంబంధించిన వివరాలను అందజేయాల్సిందిగా వివిధ బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించినట్టు తెలుస్తోంది.
rbi
banking
sector
stable
Gautam Adani

More Telugu News