Team India: బొట్టు పెట్టొద్దన్న క్రికెటర్లు సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లపై ట్రోలింగ్!

  • ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం నాగ్ పూర్ లో ప్రాక్టీస్ చేస్తున్న టీమిండియా
  • హోటల్ కు వచ్చిన క్రికెటర్లకు తిలకం దిద్ది స్వాగతం పలికిన సిబ్బంది
  • నిరాకరించిన సిరాజ్, ఉమ్రాన్ పై  సోషల్ మీడియాలో విమర్శలు
Indian cricketers siraj and umran trolled for refusing Tilak

భారత జట్టు క్రికెటర్లు మహ్మద్ సిరాజ్, ఉమ్రాన్ మాలిక్‌లు సోషల్ మీడియా ట్రోలింగ్ కు గురవుతున్నారు. నుదిటిపై తిలకం పెట్టుకునేందుకు నిరాకరించడమే ఇందుకు కారణమైంది. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్ కోసం భారత జట్టు నాగ్ పూర్ లో ప్రాక్టీస్ చేస్తోంది. జట్టు సభ్యులంతా నాగ్ పూర్ లోని ఓ హోటల్ లో బస చేస్తున్నారు. తమ హోటల్ కు వచ్చిన భారత ఆటగాళ్లు, సహాయ సిబ్బందికి హోటల్ సిబ్బంది స్వాగతం పలికారు. నుదిటిపై బొట్టు పెడుతూ ఆహ్వానించారు. అలా హోటల్ సిబ్బంది తిలకం పెట్టబోతుండగా సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ వద్దని నిరాకరించారు. తమ మత విశ్వాసాలకు అనుగుణంగా వీరు తిలకం పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. 

ఈ ఇద్దరితో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్, జట్టు సహాయక సిబ్బందిలో హరి ప్రసాద్ మోహన్ కూడా ఇలానే నిరాకరించారు. కానీ, సోషల్ మీడియాలో అభిమానులు మాత్రం సిరాజ్, ఉమ్రాన్ మాలిక్ లనే లక్ష్యంగా చేసుకొని ట్రోలింగ్ చేస్తున్నారు. వీళ్లు ఆడుతున్నది భారత జట్టుకు.. పాకిస్థాన్ కు కాదంటూ విమర్శలు చేశారు. అంతర్జాతీయ క్రికెటర్లుగా ఎదిగినా ఇంకా మత విశ్వాసాలను పాటించడం ఏంటని ప్రశ్నించారు. అయితే, మరికొందరు సిరాజ్, ఉమ్రాన్ కు బాసటగా నిలిచారు. విక్రమ్ రాథోడ్, హరి ప్రసాద్ మోహన్ కూడా తిలకానికి నిరాకరించారని, వాళ్లను కాకుండా ముస్లిం ఆటగాళ్లు అయిన సిరాజ్, ఉమ్రాన్ లనే ఎందుకు విమర్శిస్తున్నారని ప్రశ్నిస్తున్నారు.

More Telugu News