Tarakaratna: మరింత మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తారకరత్న...?

  • ఈ నెల 27న గుండెపోటుకు గురైన తారకరత్న
  • బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స
  • గుండెపోటు సమయంలో 45 నిమిషాల సేపు నిలిచిన రక్తప్రసరణ
  • ఇంకా సాధారణ స్థితికి రాని మెదడు.. నేడు మెదడుకు స్కానింగ్
Family members will move Tarakaratna abroad for better treatment

కుప్పంలో యువగళం పాదయాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొన్న నందమూరి తారకరత్న గుండెపోటుతో కుప్పకూలిన సంగతి తెలిసిందే. ఆయనకు తొలుత కుప్పంలో చికిత్స అందించగా, ఆ తర్వాత మెరుగైన చికిత్స కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆయన అక్కడే చికిత్స పొందుతున్నారు. 

అయితే, తారకరత్న మెదడు పరిస్థితి ఇంకా మెరుగవ్వాల్సి ఉందని తెలుస్తోంది. గుండె, కాలేయం సజావుగానే పనిచేస్తున్నాయని, 45 నిమిషాల పాటు రక్తప్రసరణ నిలిచిపోవడంతో మెదడులో కొంత భాగం డ్యామేజి అయినట్టు ఇటీవల వైసీపీ ఎంపీ, తారకరత్న బంధువు విజయసాయిరెడ్డి వెల్లడించారు. ఈ నేపథ్యంలో, ఓ ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది. 

ఇవాళ నారాయణ హృదయాలయ వద్ద హిందూపురం టీడీపీ నేతలు తారకరత్న ఆరోగ్యాన్ని కాంక్షిస్తూ పూజలు చేశారు. ఈ సందర్భంగా హిందూపురం పార్లమెంట్ స్థానం జనరల్ సెక్రటరీ అంబికా లక్ష్మీనారాయణ మీడియాతో మాట్లాడారు. 

తారకరత్నను మరింత మెరుగైన చికిత్స కోసం విదేశాలకు తీసుకెళ్లేందుకు కుటుంబ సభ్యులు ఆలోచిస్తున్నారని వెల్లడించారు. ఇవాళ ఆసుపత్రిలో తారకరత్న మెదడుకు స్కానింగ్ చేశారని, ఆ నివేదిక వస్తే తారకరత్న మెదడు పరిస్థితి తెలుస్తుందని అన్నారు. ఆ నివేదిక ఆధారంగా తారకరత్నను విదేశాలకు తీసుకెళ్లేదీ, లేనిదీ ఆయన కుటుంబ సభ్యులు నిర్ణయించుకుంటారని లక్ష్మీనారాయణ వివరించారు. తారకరత్నను బాలకృష్ణ దగ్గరుండి చూసుకుంటున్నారని తెలిపారు.

More Telugu News