wine: ‘మద్యం కాదు.. పాలు తాగండి’.. వైన్ షాపు ముందు ఆవును కట్టేసి, ఉమాభారతి ప్రచారం

BJPs Uma Bharti Ties Stray Cows In Front Of Liquor Shops
  • మధ్యప్రదేశ్ లోని నివారీ జిల్లాలో వైన్ షాపు ముందు నిరసన
  • గతేడాది మార్చిలోనూ ఇదే దుకాణంపైకి రాళ్లు విసిరిన ఉమా భారతి
  • మద్యాన్ని ఆదాయవనరుగా చూడొద్దని ప్రభుత్వానికి పిలుపు
  • బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్యపాన నిషేధం కోసం కృషి చేస్తానని వెల్లడి
భారతీయ జనతా పార్టీ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమా భారతి మద్యపాన నిషేధానికి గురువారం వినూత్నంగా ప్రచారం చేశారు. రాష్ట్రంలోని నివారీ జిల్లాలో ఓ వైన్ షాపు ముందు ఆవును కట్టేశారు. మద్యం కొనుగోలు చేసేందుకు వచ్చే వారికి ‘మద్యం కాదు.. ఆవు పాలు తాగండి’ అని చెప్పేందుకే ఇలా చేశానని వివరించారు. మద్యపానంతో ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని ఫణంగా పెడితే వచ్చే సొమ్ము కోసం ఆశపడొద్దని, మద్యాన్ని ఆదాయ వనరుగా చూడొద్దని ఉమా భారతి ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.

రాష్ట్రంలోని పేద ప్రజలకు మద్యపానం ఓ సమస్యగా మారిందని, దీనికి తాను కూడా కొంతవరకు కారణమేనని ఉమా భారతి చెప్పారు. అందుకే మధ్యప్రదేశ్ తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలలో మద్యపాన నిషేధం కోసం కృషి చేస్తానని ఉమా భారతి తెలిపారు. కాగా, తన షాపు ముందు ఆవును కట్టేయడంతో భయపడిన యజమాని.. వెంటనే షాపు మూసేసి వెళ్లిపోయాడు. గతేడాది కూడా ఇదే షాపు ముందు ఉమా భారతి ఆందోళన చేశారు. షాపుపై ఆవు పేడను, రాళ్లను విసిరారు. అప్పట్లో ఇది వివాదాస్పదంగా మారింది.
wine
liquor
drinking
Madhya Pradesh
uma bharati
BJP

More Telugu News