Chandrababu: దేశానికి బాగుంది.. రాష్ట్రానికి ఏమీ లేదు.. 31 మంది వైసీపీ ఎంపీలు ఉండీ ఏమీ చేయలేకపోయారు: కేంద్ర బడ్జెట్ పై చంద్రబాబు

31 YSRCP MPs does not did any thing for AP in union budget says Chandrababu
  • ప్రపంచంలో 5వ ఆర్థిక శక్తిగా భారత్ నిలవడం శుభపరిణామమన్న చంద్రబాబు
  • వ్యవసాయ, మౌలిక రంగాలను నిలబెట్టేలా కేంద్ర బడ్జెట్ ప్రణాళికలు ఉన్నాయని కితాబు
  • కేసులు, స్వప్రయోజనాలకే వైసీపీ ఎంపీలు కట్టుబడి ఉన్నారని మండిపాటు
2014లో ప్రపంచంలో 10వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వ్యవస్థ...ఇప్పుడు 5వ స్థానంలోకి రావడం గొప్ప విషయం అని చంద్రబాబు నాయుడు అన్నారు. నేటి కేంద్ర బడ్జెట్ లో పెట్టుబడి వ్యయం రూ.13.7 లక్షల కోట్లు కేటాయించడం మంచి విషయమని చెప్పారు. వచ్చే 25 ఏళ్లకు... అంటే 2047 లక్ష్యంగా పథకాలు, కార్యక్రమాల రూపకల్పన దిశగా ఆలోచనలు చేయడాన్ని స్వాగతించారు. విజన్- 2047 ద్వారా ప్రపంచ అగ్రగామిగా భారత్ మారుతుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో మాక్రో లెవెల్ ప్రణాళికలు- మైక్రో లెవల్ అమలు ద్వారా లక్ష్యాలను చేరుకోవచ్చని అన్నారు. 

రైతులకు ప్రోత్సాహకంగా రూ. 20 లక్షల కోట్ల వ్యవసాయ రుణాలు, పీఎం ఆవాస్ యోజన పథకం కింద గృహ నిర్మాణం కోసం రూ. 79 వేల కోట్లు, ఆక్వారంగానికి రూ. 6 వేల కోట్లు కేటాయించడాన్ని స్వాగతిస్తున్నామని తెలిపారు. రవాణా రంగంలో 100 ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులపై రూ. 75 వేల కోట్ల పెట్టుబడులు ఉత్తమ ఫలితాలను ఇస్తాయని చంద్రబాబు నాయుడు అన్నారు. రైల్వే శాఖకు రూ. 2.40 లక్షల కోట్ల కేటాయింపుతో రైల్వే అభివృద్ధి వేగవంతం అవుతుందని అభిప్రాయపడ్డారు. ఆదాయపు పన్ను శ్లాబ్ లలో మార్పులు తెచ్చి వేతన జీవులకు ఊరట కల్పించడంపై సంతోషాన్ని వ్యక్తం చేశారు. 

అయితే బడ్జెట్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రాజెక్టులకు ఆశించిన కేటాయింపులు లేకపోవడం నిరుత్సాహాన్ని కలిగించిందని చంద్రబాబు నాయుడు అన్నారు. కర్ణాటకలో కరవు ప్రాంతాల కోసం కేంద్ర బడ్జెట్లో రూ. 5,300 కోట్లు కేటాయించారని... అయితే విభజన చట్టం ప్రకారం ఏపీలో 7 వెనుకబడిన జిల్లాలకు ప్యాకేజీ ఇవ్వాల్సి ఉన్నా.... వాటిని సాధించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం అయ్యింది దుయ్యబట్టారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల కేటాయింపు, విభజన హామీల అమలు, రాజధాని నిర్మాణానికి నిధులు సాధించడంలో వైఎస్ జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని విమర్శించారు. 

విభజన హామీల అమలుకు ఇదే చివరి బడ్జెట్ అని... ఈ బడ్జెట్ లో కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని చంద్రబాబు అన్నారు. 31 మంది ఎంపీలు ఉండి ఏం సాధించారని ప్రశ్నించారు. ప్రాజెక్టులు, నిధుల కేటాయింపుల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తేవడంలో సీఎం జగన్, వైసీపీ ఎంపీలు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు. సొంత కేసులు, స్వప్రయోజనాలకు మాత్రమే వైసీపీ ఎంపీలు కట్టుబడి ఉన్నారని మరోసారి రుజువైందని మండిపడ్డారు.
Chandrababu
Telugudesam
YSRCP
Union Budget

More Telugu News