Sri Lanka: శ్రీలంక క్యాథలిక్ సమాజానికి మాజీ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన క్షమాపణలు

  • 2019లో శ్రీలంక చర్చిల్లో ఉగ్రదాడులు
  • 270 మంది మృతి.. 500 మందికిపైగా గాయాలు
  • అప్పటి అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేనకు కోర్టు రూ. 2.2 కోట్ల జరిమానా
  • సిరిసేనను నిర్దోషిగా ప్రకటించడంపై ఆర్చ్ బిషప్ తీవ్ర అసంతృప్తి
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానన్న సిరిసేన
Sri Lanka ex President Sirisena apologises to Catholic community

ఏప్రిల్ 2019లో ఈస్టర్ సండే రోజున శ్రీలంకలోని మూడు ప్రార్థనా మందిరాలతోపాటు పలు హోటళ్లలో జరిగిన ఆత్మాహుతి దాడుల్లో 270 మంది మరణించారు. 500 మందికిపైగా గాయపడ్డారు. కరడుగట్టిన ఉగ్రవాద సంస్థ ఐసిస్‌తో సంబంధం ఉన్న ఉగ్రవాదులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. ఈ ఘటనపై తాజాగా ఆ దేశ మాజీ అధ్యక్షుడు మైత్రీపాల సిరిసేన స్పందించారు.

దేశంలోని క్యాథలిక్ సమాజానికి ఆయన క్షమాపణలు తెలిపారు. ముందస్తు నిఘా సమాచారం ఉన్నప్పటికీ దాడులను నివారించలేకపోయారంటూ అప్పటి అధ్యక్షుడు సిరిసేన, రణిల్ విక్రమసింఘేలపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజాగా సిరిసేన క్షమాపణలు తెలిపారు. 

‘శ్రీలంక ఫ్రీడం పార్టీ’ నేతల సమావేశంలో పాల్గొన్న సిరిసేన మాట్లాడుతూ.. నాటి ఉగ్రదాడుల ఘటనపై క్యాథిలిక్ సమాజానికి క్షమాపణలు తెలియజేసుకుంటున్నట్టు చెప్పారు. అలాగే, వచ్చే ఏడాది జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్టు తెలిపారు. కాగా, నాటి ఉగ్రఘటనపై శ్రీలంక సుప్రీంకోర్టు ఇటీవల సిరిసేనకు రూ. 2.2  కోట్ల జరిమానా విధించింది. ఆ సొమ్మును ఆయన తన వ్యక్తిగత ఖాతా నుంచి చెల్లించాలని ఆదేశించింది. 

అయితే, నిఘా వర్గాల నుంచి సమాచారం ఉన్నప్పటికీ దాడులను నివారించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి వేసిన కేసులో సిరిసేనను కోర్టు నిర్దోషిగా ప్రకటించింది. దీనిపై శ్రీలంక క్యాథలిక్ చర్చి ఆర్చ్ బిషప్ మాల్కం రంజిత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో  సిరిసేన తాజాగా క్షమాపణలు చెప్పడం ప్రాధాన్యం సంతరించుకుంది.

More Telugu News