Sudhakar: నిన్నటితో పోల్చితే తారకరత్న ఆరోగ్యం ఇవాళ కాస్త మెరుగైంది: కర్ణాటక ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్

Karnataka health minister Sudhakar talks about Tarakaratna condition
  • తారకరత్నకు తీవ్ర గుండెపోటు
  • కుప్పం నుంచి బెంగళూరు తరలింపు
  • నారాయణ హృదయాలయలో కొనసాగుతున్న చికిత్స
  • తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నాడన్న మంత్రి సుధాకర్
  • సీఎం బొమ్మై ప్రత్యేకశ్రద్ధ తీసుకున్నారని వెల్లడి
నందమూరి తారకరత్న బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో అత్యవసర చికిత్స పొందుతున్న నేపథ్యంలో, కర్ణాటక ప్రభుత్వం పరిస్థితిని పర్యవేక్షిస్తోంది. కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై ఆదేశాలతో రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుధాకర్ స్వయంగా ఆసుపత్రికి వచ్చి తారకరత్న చికిత్స తీరుతెన్నులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి వద్ద మీడియాతో మాట్లాడారు. 

తారకరత్నను కుప్పం నుంచి బెంగళూరు తీసుకువచ్చేందుకు గ్రీన్ చానల్ కారిడార్ ఏర్పాటు చేశామని చెప్పారు. తారకరత్నకు నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో వైద్య చికిత్స జరుగుతోందని, నిన్నటి కంటే ఇవాళ ఆయన ఆరోగ్య పరిస్థితి కాస్త మెరుగైనట్టు భావిస్తున్నామని మంత్రి సుధాకర్ వెల్లడించారు. తారకరత్న చికిత్సకు స్పందిస్తున్నారని తెలిపారు. 

నిమ్హాన్స్ నుంచి బ్రెయిన్ స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా పిలిపించామని, రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తోందని పేర్కొన్నారు. తారకరత్న పరిస్థితిపై సీఎం బసవరాజ్ బొమ్మై ప్రత్యేకశ్రద్ధ కనబరుస్తున్నారని స్పష్టం చేశారు. మంత్రి సుధాకర్ మీడియాతో మాట్లాడే సమయంలో జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఆయన పక్కనే ఉన్నారు.
Sudhakar
Health Minister
Tarakaratna
Bengaluru
Karnataka

More Telugu News