Ukraine: రష్యా, బెలారస్ ఆస్తులను మా రక్షణకు వాడుకుంటాం: జెలెన్ స్కీ

  • 182 రష్యా, బెలారస్ కంపెనీలు, ముగ్గురు వ్యక్తులపై ఉక్రెయిన్ ఆంక్షలు
  • తమ దేశంలో ఉన్న ఆ రెండు దేశాల ఆస్తులను బ్లాక్ చేస్తామని ప్రకటన
  • గతేడాది ఫిబ్రవరి నుంచి కొనసాగుతున్నరష్యా, ఉక్రెయిన్ యుద్ధం
Russian Assets Will Be Used For Our Defence says Ukraine

దాదాపు ఏడాది కాలంగా రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతోంది. నిలువెల్లా ధ్వంసమైనా ఉక్రెయిన్ వెన్నుచూపడం లేదు.. పాశ్చాత్య దేశాలు కత్తికట్టినా రష్యా వెనక్కి తగ్గడం లేదు. దీంతో యుద్ధం సుదీర్ఘంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్ స్కీ కీలక నిర్ణయం తీసుకున్నారు. 182 రష్యా, బెలారస్ కంపెనీలు, మరో ముగ్గురు వ్యక్తులపై ఆంక్షలు విధించారు. ‘‘ఉక్రెయిన్ లో ఉన్న రష్యా, బెలారస్ ఆస్తులను బ్లాక్ చేస్తాం. వాటిని మా రక్షణ కోసం ఉపయోగిస్తాం’’ అని జెలెన్ స్కీ చెప్పారు.

ఉక్రెయిన్ నేషనల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కౌన్సిల్ ప్రచురించిన జాబితా ప్రకారం.. ప్రధానంగా వస్తువుల రవాణా, వాహనాల లీజింగ్, రసాయన ఉత్పత్తిలో ఉన్న సంస్థలపై ఆంక్షలు విధించారు. రష్యన్ పొటాష్ ఎరువుల ఉత్పత్తిదారు, ఎగుమతిదారు ‘ఉరల్కాలి’, బెలారస్ ప్రభుత్వ యాజమాన్యంలోని పొటాష్ ఉత్పత్తిదారు బెలారస్కాలి, బెలారసియన్ రైల్వేలు, రష్యాకు చెందిన వీటీబీ-లీజింగ్, గాజ్‌ప్రోమ్‌ బ్యాంక్ లీజింగ్ వంటి సంస్థలు ఈ జాబితాలో ఉన్నాయి.

గత ఏడాది ఫిబ్రవరిలో ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించింది. అప్పటి నుంచి ప్రతిరోజూ బాంబుల వర్షం కురిపిస్తోంది. రష్యన్ సైనికులు, ఉక్రెయిన్ సైనికులు, ప్రజలు వేలల్లో చనిపోయారు. యుద్ధం మొదలైనప్పటి నుంచి వందలాది మంది రష్యన్, బెలారసియన్ వ్యక్తులు, సంస్థలపై ఉక్రెయిన్ ఆంక్షలు విధించింది. చాలా దేశాలు రష్యా ఉత్పత్తులను, ఆ దేశంతో వ్యాపారాలను నిలిపేశాయి.

More Telugu News