అదానీ గ్రూప్ రుణాలపై వర్రీ లేదంటున్న ప్రభుత్వరంగ బ్యాంకులు
- అదానీ గ్రూపు రుణాలపై ఆందోళనలు లేవన్న ఎస్ బీఐ చైర్మన్ ఖరా
- వివరణ కోరినట్టు ప్రకటన ..ప్రైవేట బ్యాంకులదీ ఇదే ధోరణి
- ఆర్ బీఐ నిబంధనలకు లోబడే రుణాలు ఇచ్చినట్టు బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడి
ఆర్ బీఐ నిబంధనలకు లోబడే తాము అదానీ గ్రూపునకు రుణాలు ఇచ్చినట్టు బ్యాంకులు ప్రకటించాయి. ఆర్ బీఐ నిబంధనల కింద ఒక బ్యాంకు తన నిధుల్లో ఏదైనా ఒక కార్పొరేట్ గ్రూప్ నకు 25 శాతం మించి ఇవ్వకూడదు. దేశంలోనే దిగ్గజ బ్యాంక్, ప్రభుత్వరంగ ఎస్ బీఐ చైర్మన్ దినేష్ ఖరా స్పందిస్తూ.. ‘‘అదానీ గ్రూప్ కంపెనీలకు మేము ఇచ్చిన రుణాలపై ఎలాంటి ప్రమాద ఘంటికలు లేవు. ఇప్పటి వరకు మాకు ఎలాంటి ఆందోళనలు లేవు’’ అని స్పష్టం చేశారు. ఇటీవల అదానీ గ్రూప్ ఎస్ బీఐ నుంచి ఎలాంటి రుణాలు తీసుకోలేదన్నారు. భవిష్యత్తులో అదానీ గ్రూప్ నుంచి రుణ అభ్యర్థనలు వస్తే కనుక తగిన నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు.
అదానీ గ్రూప్ నుంచి తాజా ఆరోపణలపై వివరణ కోరినట్టు ఖరా తెలిపారు. ఈ స్పందన వచ్చిన తర్వాతే సంబంధిత గ్రూప్ నకు తాము ఇచ్చిన రుణాలపై బోర్డులో నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం స్పందిస్తూ.. ఆర్ బీఐ అనుమతించిన దానికంటే, తక్కువే రుణ మొత్తాన్ని తాము అదానీ గ్రూప్ నకు ఇచ్చినట్టు స్పష్టం చేసింది. గత నెల వరకు అదానీ గ్రూపు రుణాలపై చెల్లింపులు కొనసాగుతూనే ఉన్నట్టు తెలిపింది. తాము ఎలాంటి ఆందోళన చెందడం లేదని, కాకపోతే పరిశీలనలో ఉంచినట్టు రెండు ప్రైవేటు బ్యాంకుల ప్రతినిధులు ప్రకటించారు.