జమున మృతి పట్ల జగన్, కేసీఆర్, చిరంజీవి సంతాపం
- కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన జగన్, కేసీఆర్
- సామాజిక అంశాలపైనా జమునకు ఆసక్తి ఎక్కువగా ఉండేదన్న కిషన్ రెడ్డి
- తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారన్న చిరంజీవి
జమున మరణం సినీ పరిశ్రమకు తీరని లోటని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అన్నారు. తొలితరం నటిగా వందలాది చిత్రాల్లో నటించి, తెలుగువారి అభిమాన తారగా వెలుగొందిన జమున జ్జాపకాలను కేసీఆర్ స్మరించుకున్నారు. నటిగా కళాసేవనే కాకుండా పార్లమెంటు సభ్యురాలిగా ప్రజాసేవ చేయడం గొప్ప విషయమన్నారు. ఈ సందర్భంగా జమున కుటుంబ సభ్యులకు సీఎం కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
విలక్షణమైన నటనతోపాటుగా సామాజిక అంశాలపైనా జమునకు ఆసక్తి ఎక్కువగా ఉండేదని కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీలో జమునతో కలిసి పనిచేసిన సందర్భంలో ఆమెతో వ్యక్తిగత అనుబంధం ఏర్పడిందన్నారు. కలిసిన ప్రతిసారీ ఎంతో ఆత్మీయంగా పలకరించేవారని గుర్తు చేసుకున్నారు. ‘భారతీయత సంస్కృతి, సంప్రదాయాలకు నిలువెత్తు రూపంగా నిలిచిన శ్రీమతి జమునగారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. వారి కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను’ అని పేర్కొన్నారు.
చిరంజీవి స్పందిస్తూ.. ‘సీనియర్ హీరోయిన్ జమున గారు స్వర్గస్తులయ్యారనే వార్త ఎంతో విచారకరం. ఆవిడ బహుభాషా నటి. మాతృభాష కన్నడం అయినా ఎన్నెన్నో విజయవంతమైన చిత్రాలతో తెలుగు వారి మనసుల్లో చెరగని ముద్ర వేశారు. మహానటి సావిత్రి గారితో ఆవిడ అనుబంధం ఎంతో గొప్పది. ఆవిడ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేసుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు.