Chauhan Devusinh Jesingbhai: ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి తీవ్ర వ్యాఖ్యలు

central minister devusinh sensational comments about ap government
  • రాష్ట్రం ప్రమాదకర పరిస్థితుల్లో ఉందన్న దేవుసిన్హ్ చౌహాన్
  • సుపరిపాలన అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని వ్యాఖ్య
  • అతి తక్కువ కాలంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని విమర్శ
  • ఇతర పార్టీలను అణచివేసేందుకు వాలంటీర్లను వాడుకుంటున్నారని మండిపాటు
  • వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం
ఏపీ ప్రభుత్వంపై కేంద్ర మంత్రి దేవుసిన్హ్ చౌహాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సుపరిపాలన అందించడంలో సీఎం జగన్ విఫలమయ్యారని ఆరోపించారు. అతి తక్కువ సమయంలోనే ఏపీ ప్రభుత్వం ప్రజాదరణ కోల్పోయిందని విమర్శించారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రమాదకర పరిస్థితుల్లో ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

కర్నూలులో మీడియాతో దేవుసిన్హ్ చౌహాన్ మాట్లాడారు. కేంద్రం ఇస్తున్న నిధులను రాష్ట్ర ప్రభుత్వం సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. గ్రామీణాభివృద్ధికి ప్రణాళిక సంఘం ఇచ్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం వేరే మార్గంలో వాడుకుందని, దీనిపై సర్పంచ్ లు తనకు వినతి పత్రాలు ఇచ్చారని, ఇది గ్రామ స్వరాజ్యంపై దాడి అని అన్నారు. పంచాయతీలకు ఇచ్చే నిధులను గ్రామాల అభివృద్ధికి ఉపయోగించాలని సూచించారు.

రాష్ట్రంలో ఉద్యోగులు, పెన్షనర్లు జీతాలు అందక ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. వారికి జీతాలు ఇవ్వని ప్రభుత్వం.. వాలంటీర్లకు మాత్రం జీతాలు ఇస్తోందని విమర్శించారు. వాలంటీర్లకు ప్రభుత్వ నిధులు పంచుతున్నారని, ఇతర పార్టీలను అణచివేసేందుకు వారిని వాడుకుంటున్నారని ఆరోపించారు. ఇది ప్రజాస్వామ్యం కాదని మండిపడ్డారు. 

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉందని దేవుసిన్హ్ చౌహాన్ విమర్శించారు. ఏపీ ప్రభుత్వంపై ప్రజలు సంతృప్తిగా లేరని, వచ్చే లోక్ సభ ఎన్నికల్లో వైసీపీకి ఒక్క సీటు కూడా రాదని జోస్యం చెప్పారు. కేంద్రం 20 లక్షల ఇళ్లను ఏపీకి మంజూరు చేసిందని, కానీ ఇక్కడ ఒక్కటి కూడా నిర్మించడం లేదని ఆరోపించారు.

రాష్ట్రంలో మౌలిక సదుపాయాలు కూడా లేవని.. ఆయుష్మాన్ కార్డులను పేదలకు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కేంద్రం చేసిన అభివృద్ధి, రాష్ట్రం చేసిన అభివృద్ధి ప్రజలకు కళ్లముందే కనిపిస్తోందని చెప్పారు. ఏపీలోని ప్రతి వ్యక్తికి సాయం చేసేందుకు ప్రధాని మోదీ సిద్ధంగా ఉన్నారని చెప్పారు. ఇకపై ఏపీలో ప్రతి నెల ఒక కేంద్ర మంత్రి పర్యటిస్తారని చౌహాన్ చెప్పారు.
Chauhan Devusinh Jesingbhai
central minister devusinh
ap government
Jagan

More Telugu News