Mangli: గాయని మంగ్లీ కారుపై రాళ్లదాడి... ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఘటన

Stone pelting attack on singer Mangli car in Karnataka
  • కర్ణాటకలో ఓ ఈవెంట్ లో పాల్గొన్న మంగ్లీ
  • తిరిగొస్తుండగా కారుపై రాళ్ల దాడి
  • బళ్లారిలో ఘటన
ప్రముఖ గాయని మంగ్లీ ప్రయాణిస్తున్న కారుపై కర్ణాటకలో రాళ్ల దాడి జరిగిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కొన్నిరోజుల కిందట బళ్లారి నగరంలో మున్సిపల్ కాలేజి మైదానంలో బళ్లారి ఉత్సవ్ పేరిట వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ కుటుంబ సభ్యులు కూడా హాజరయ్యారు. బళ్లారి ఉత్సవ్ వేడుకల్లో గాయని మంగ్లీ తన పాటలతో అలరించారు. 

ఈ కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా బళ్లారిలో ఆ కారుపై కొందరు వ్యక్తులు రాళ్లు విసిరారు. ఈ దాడిలో కారు స్వల్పంగా దెబ్బతిన్నట్టు తెలుస్తోంది. బళ్లారి ఉత్సవ్ సందర్భంగా... మంగ్లీ మేకప్ టెంట్ లో ఉన్న సమయంలో ఆమెను చూసేందుకు కొందరు యువకులు వచ్చారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు. 

అంతకుముందు, చిక్కబళ్లాపూర్ లో జరిగిన ఓ కార్యక్రమంలో మంగ్లీ అతికష్టమ్మీద కన్నడలో కొన్ని మాటలు మాట్లాడింది. దాంతో, మంగ్లీపై విమర్శలు వచ్చాయి. రెండేళ్ల నుంచి కన్నడ చిత్ర పరిశ్రమలో ఉంటూ కన్నడలో మాట్లాడకపోవడం ఏంటని విమర్శలు వచ్చాయి. ఇలాంటి వారికి కన్నడ చిత్ర పరిశ్రమలో ఎందుకు అవకాశాలు ఇస్తారు? అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 

పై రెండు ఘటనల్లో ఏదో ఒక ఘటన కారణంగానే మంగ్లీ కారుపై రాళ్ల దాడి జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు.
Mangli
Singer
Stone Pelting
Car
Karnataka

More Telugu News