Swiggy: స్విగ్గీలో 380 మందిని తొలగిస్తూ ఈ మెయిల్స్

Swiggy fires 380 employees CEO apologizes and says company overhired
  • మన్నించాలంటూ తొలగించిన వారికి కంపెనీ సీఈవో శ్రీహర్ష లేఖ
  • అందుకు దారితీసిన పరిస్థితులపై వివరణ
  • ఫుడ్ డెలివరీ వ్యాపారంలో వృద్ధి తగ్గినట్టు ప్రకటన
ఆన్ లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీ ఉద్యోగులకు షాకిచ్చింది. 380 మంది ఉద్యోగులను తొలగించింది. ఈ మేరకు వారికి ఈ మెయిల్స్ పంపించింది. వందలాది మంది ఉద్యోగులను తొలగించక తప్పని పరిస్థితి వచ్చినట్టు పేర్కొంది. తొలగించిన ఉద్యోగులకు స్విగ్గీ సీఈవో శ్రీహర్ష మాజేటి క్షమాపణలు చెప్పారు. ఎందుకు తొలగించాల్సి వచ్చిందో ఈ మెయిల్ లో తెలిపారు.

‘‘పునర్నిర్మాణ ప్రక్రియలో భాగంగా ఉద్యోగుల సంఖ్యను తగ్గించే కఠిన నిర్ణయాన్ని అమలు చేస్తున్నాం. ఈ ప్రక్రియలో నైపుణ్యవంతులైన 380 మంది స్విగ్ స్టర్స్ కు గుడ్ బై చెబుతున్నాం. అందుబాటులో ఉన్న అన్ని రకాల ఆప్షన్లను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయాన్ని తీసుకోవాల్సి వచ్చింది. ఈ విషయంలో మీ అందరికీ నా క్షమాపణలు తెలియజేస్తున్నాను’’ అని శ్రీహర్ష పేర్కొన్నారు. 

స్థూల ఆర్థిక పరిస్థితులను స్విగ్గీ కారణంగా చూపించింది. గడిచిన ఏడాదిగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కంపెనీలు ఉద్యోగుల తొలగింపు నిర్ణయాలను తీసుకున్నట్టు, అందుకు స్విగ్గీ కూడా అతీతం కాదని శ్రీహర్ష పేర్కొన్నారు. ఫుడ్ డెలివరీ వ్యాపారానికి సంబంధించి వృద్ధి రేటు నిదానించిందని, ఆదాయం తగ్గినట్టు వివరించారు. అయితే కంపెనీ మనుగడకు కావాల్సిన నగదు నిల్వలు ఉన్నట్టు చెప్పారు. ఇతర మార్గాల్లోనూ వ్యయాలు తగ్గించుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలిపారు. లాభాల్లోకి రావాల్సిన లక్ష్యాన్ని ముందుకు జరిపినట్టు ప్రకటించారు.
Swiggy
removed
fired
employees

More Telugu News