China: చైనా నీటి యుద్ధానికి చెక్ పెట్టేందుకు కేంద్రం మాస్టర్ ప్లాన్

  • బ్రహ్మపుత్ర ఎగువన 60,000 మెగావాట్లతో చైనా ప్రాజెక్ట్
  • నీటిని ఒక్కసారిగా విడిచిపెడితే భారత్ లో వరదల ముప్పు
  • దీనికి విరుగుడుగా అరుణాచల్ ప్రదేశ్ లో 11,000 మెగావాట్ల భారీ ప్రాజెక్ట్
Fearing water war by China government puts Arunachal dams

భారత్ ను నేరుగా ఎదుర్కొనకుండా పొరుగు దేశం చైనా దొంగ దెబ్బలకు వ్యూహాలు రచిస్తోంది. నైసర్గికంగా చైనా భారత్ కు ఎగువన ఉంటుంది. దీంతో భారీ వరదల సమయంలో ఒక్కసారిగా కిందకు పెద్ద మొత్తంలో నీటిని విడుదల చేయడం ద్వారా భారీ నష్టానికి డ్రాగన్ కుయుక్తులు పన్నుతున్నట్టు కేంద్ర సర్కారు అనుమానిస్తోంది. అంతేకాదు, మోస్తరు వర్షపాతం సమయాల్లో అసలు నీటిని కిందకు వదలకుండా దారి మళ్లించి, అవసరమైతే భారత్ లోని బ్రహ్మపుత్ర పరీవాహక ప్రాంతాల్లో కరవును సైతం సృష్టించొచ్చన్నది చైనా వ్యూహంగా కేంద్రం అనుమానిస్తోంది.

అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుకు సమీపంలో మెడాంగ్ వద్ద.. బ్రహ్మపుత్ర నదిపై (చైనాలో దీన్ని యార్లంగ్ జాంగ్బో అని పిలుస్తారు) చైనా  60వేల మెగావాట్ల సామర్థ్యంతో భారీ జల విద్యుత్ తయారీ ప్రాజెక్టు చేపట్టినట్టు అధికార వర్గాలు తెలిపాయి. ఈ ప్రాజెక్టు నుంచి నీటిని ఒక్కసారిగా దిగువకు విడిచిపెడితే లక్షలాది మంది ప్రజలు బాధితులుగా మారే ప్రమాదం ఉంటుందని అంచనా. మన దేశంలో 30 శాతం సహజ నీటి వనరులు, 40 శాతం జల విద్యుత్ తయారీకి బ్రహ్మపుత్ర నది ఎంతో కీలకంగా ఉంది. బ్రహ్మపుత్ర నది పరీవాహక ప్రాంతంలో సగం చైనాలోనే ఉండడం గమనార్హం. 

దీంతో చైనా ఒక్కసారిగా నీటిని విడిచిపెట్టినా వరదలు రాకుండా అరుణాచల్ ప్రదేశ్ లోని అప్పర్ సుబన్ సిరిలో 11,000 మెగావాట్ల సామర్థ్యంతో జల విద్యుత్ ప్రాజెక్టు తయారీకి కేంద్ర సర్కారు రంగం సిద్ధం చేసింది. ఎన్ హెచ్ పీసీ సంస్థ ఆధ్వర్యంలో దీన్ని నిర్మించనుంది. అలాగే, 2,000 మెగావాట్ల సామర్థ్యంలో లోయర్ సుబన్ సిరి ప్రాజెక్ట్ ఈ ఏడాది మధ్య నాటికి పూర్తి చేయనుంది. ఈ ప్రాజెక్టులతో వరద ముప్పును అడ్డుకోవడమే కాకుండా, పెద్ద మొత్తంలో నీటిని నిల్వ చేసి, వాడుకునే అవకాశం ఏర్పడుతుంది.

More Telugu News