Samsung: శామ్ సంగ్ నుంచి బడ్జెట్ ధరలో రెండు స్మార్ట్ ఫోన్లు

Samsung Galaxy A14 and Galaxy A23 5G phones launched in India price starts at Rs 16499
  • గెలాక్సీ ఏ14 5జీ, గెలాక్సీ ఏ23 5జీ విడుదల
  • ఏ 14లో మూడు వేరియంట్లు.. రూ.16,499 నుంచి ధరలు ప్రారంభం
  • ఏ 23లో రెండు వేరియంట్లు రూ.22,999 నుంచి ధరలు ఆరంభం
  • బ్యాంకు కార్డులపై మరో రూ.1,500 తగ్గింపు
దక్షిణ కొరియాకు చెందిన శామ్ సంగ్ భారత మార్కెట్లో రెండు బడ్జెట్ 5జీ స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. గెలాక్సీ ఏ14 5జీ, గెలాక్సీ ఏ23 5జీ పేరుతో వచ్చిన ఈ రెండూ 5జీ టెక్నాలజీకి సైతం సపోర్ట్ చేస్తాయి.

ధరలు
గెలాక్సీ ఏ14 5జీ డార్క్ రెడ్, లైట్ గ్రీన్, బ్లాక్ రంగుల్లో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.20,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.18,999. 4జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజీ ధర రూ.16,499. ఎస్ బీఐ, ఐడీఎఫ్ సీ ఫస్ట్ బ్యాంక్ కార్డులపై రూ.1,500 డిస్కౌంట్ లభిస్తుంది. ఇక గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ సిల్వర్, లైట్ బ్లూ, ఆరెంజ్ రంగుల్లో లభిస్తుంది. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.24,999. 6జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీ ధర రూ.22,999. ఈ ఫోన్ పైనా బ్యాంకు కార్డులతో కొనుగోలు చేస్తే రూ.1,500 డిస్కౌంట్ పొందొచ్చు.

ఫీచర్లు
గెలాక్సీ ఏ14 5జీ 6.6 అంగుళాల హెచ్ డీ ప్లస్ డిస్ ప్లే, 90 హెర్జ్ రీఫ్రెష్ రేట్, వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ ప్రధాన కెమెరాతో ట్రిపుల్ కెమెరా సెటప్, ముందు భాగంలో 13 మెగాపిక్సల్ కెమెరా, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 15 వాట్ చార్జర్ ఉన్నాయి. ఎక్సినోస్ 1330 ఆక్టాకోర్ చిప్ సెట్ పై పనిచేస్తుంది. ఇక ప్రైవేటు షేర్ అనే ఓ ప్రత్యేక ఫీచర్ ఉంది. బ్లాక్ చైన్ టెక్నాలజీ సాయంతో ఫోన్ లోని ఫైల్స్, మీడియాను మరో గెలాక్సీ యూజర్ తో ప్రైవేటుగా షేర్ చేసుకోవచ్చు. నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్, రెండు ఓఎస్ అప్ గ్రేడ్ లతో ఈ ఫోన్ లభిస్తుంది.

గెలాక్సీ ఏ23 5జీ ఫోన్ 6.6 అంగుళాల ఫుల్ హెచ్ డీ ప్లస్ స్క్రీన్, 120 హెర్జ్ రీఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ తో వస్తుంది. ఎడ్జ్ టు ఎడ్జ్ ఇన్ఫినిటీ వీ డిస్ ప్లే ఉంటుంది. దీనివల్ల పెద్ద స్క్రీన్ అనుభవం లభిస్తుందని శామ్ సంగ్ అంటోంది. ఇందులోనూ ఎక్సినోస్ 1330 ఆక్టాకోర్ ప్రాసెసర్ నే వినియోగించారు. వెనుక భాగంలో 50 మెగాపిక్సల్ తో కూడిన క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 25 వాట్ చార్జర్ తో వస్తుంది. శామ్ సంగ్ పోర్టల్ పై ఈ నెల 18 నుంచి ఇతర పోర్టళ్లపై 20 నుంచి విక్రయాలు మొదలవుతాయి.
Samsung
smart phones
launched
Galaxy A14 5G
Galaxy A23 5G

More Telugu News