gadkari: జైలులో నుంచి ఏకంగా కేంద్ర మంత్రికి బెదిరింపు ఫోన్ కాల్

  • వంద కోట్లు ఇవ్వకుంటే బాంబు దాడి చేస్తామని హెచ్చరిక
  • దావూద్ ఇబ్రహీం గ్యాంగ్ సభ్యుడిగా చెప్పుకున్న ఖైదీ
  • గడ్కరీ ఆఫీసు సిబ్బంది ఫిర్యాదుతో నాగ్ పూర్ పోలీసుల విచారణ
Gangster called Nitin Gadkari from Karnataka jail and demanded Rs 100 crore

జైలులో శిక్ష అనుభవిస్తున్న ఓ గ్యాంగ్ స్టర్ ఏకంగా కేంద్రమంత్రికే ఫోన్ చేసి బెదిరింపులకు దిగాడు. దావూద్ ఇబ్రహీం మనిషినని చెప్పుకుంటూ వంద కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బులు ఇవ్వకుంటే బాంబు దాడి చేస్తామని హెచ్చరించాడు. శనివారం మధ్యాహ్నం కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఆఫీసుకు మూడు సార్లు ఫోన్ చేసి బెదిరించాడా గ్యాంగ్ స్టర్. దీనిపై గడ్కరీ ఆఫీసు ఉద్యోగులు నాగ్ పూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఫోన్ నెంబర్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు.. ఆ ఫోన్ కాల్ కర్ణాటక జైలు నుంచి వచ్చినట్లు తేల్చారు. మరింత లోతుగా విచారణ చేయగా.. బెళగావి జైలులో శిక్ష అనుభవిస్తున్న జయేష్ కాంత ఈ బెదిరింపులకు పాల్పడినట్లు కనుగొన్నారు. నాగ్ పూర్ పోలీస్ కమిషనర్ అమితేష్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు వెల్లడించారు.

బెదిరింపు ఫోన్ కాల్ గురించి కర్ణాటక పోలీసులకు, బెళగావి జైలు అధికారులకు సమాచారం అందించామని చెప్పారు. జయేష్ కాంతను విచారించేందుకు కర్ణాటక పోలీసులను ప్రొడక్షన్ రిమాండ్ కోరినట్లు తెలిపారు. నాగ్ పూర్ పోలీసులు కర్ణాటక వెళ్లి జయేష్ ను నాగ్ పూర్ తీసుకొచ్చి విచారిస్తారని పేర్కొన్నారు. బెదిరింపుల నేపథ్యంలో గడ్కరీ భద్రతను కట్టుదిట్టం చేసినట్లు అమితేష్ కుమార్ చెప్పారు.

More Telugu News