Raghu Rama Krishna Raju: బాలకృష్ణ డైలాగులకు మా పార్టీ నేతలు భుజాలు తడుముకుంటున్నారు: రఘురామకృష్ణరాజు

YSRCP leaders shaking with Balakrishna dialogues say Raghu Rama Krishna Raju
  • టీడీపీ పసుపు రంగు, జనసేన ఎరుపు రంగు రెండూ కలిస్తే కాషాయం రంగు వస్తుంది
  • టీడీపీ, జనసేన కలిసి పోటీ చేస్తాయని పవన్ చెప్పకనే చెప్పారు
  • ఈ పొత్తును వైసీపీ నేతలు ప్రశ్నిస్తుండటం విడ్డూరంగా ఉంది
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శ్రేయస్సు కోసం టీడీపీ, జనసేన కలవాల్సిన అవసరం ఉందని వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణరాజు అన్నారు. ఈ రెండు పార్టీలకు మరో పార్టీ తోడుండాలని చెప్పారు. టీడీపీ పసుపు రంగు, జనసేన ఎరుపు రంగు రెండూ కలిస్తే కాషాయం రంగు వస్తుందని అన్నారు. ఈ మూడు పార్టీలు కలిసి ఉండాలని కోరుకునే వారిలో తాను కూడా ఒకడినని చెప్పారు. 

ఒక పార్టీకి బలం సరిపోనప్పుడు... పరస్పరం గౌరవాన్ని కాపాడుకుంటూనే, సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని జనసేనాని పవన్ కల్యాణ్ చేసిన సూచన చాలా బాగుందని వ్యాఖ్యానించారు. టీడీపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేస్తాయని రణస్థలం సభలో పవన్ కల్యాణ్ చెప్పకనే చెప్పేశారని అన్నారు. ఈ రెండు పార్టీల పొత్తులపై వైసీపీ నేతలు ప్రశ్నిస్తుండటం విచిత్రంగా ఉందని ఎద్దేవా చేశారు. 

గతంలో చంద్రబాబును పవన్ విమర్శించారని... ఇప్పుడు ఇద్దరూ పొత్తు ఎలా పెట్టుకుంటారని వైసీపీ నేతలు ప్రశ్నిస్తుండటం విడ్డూరంగా ఉందని రఘురాజు అన్నారు. ఇప్పుడు జగన్ మంత్రివర్గంలో ఉన్నవారిలో పలువురు గతంలో ఆయనను విమర్శించిన వారేనని చెప్పారు. ఇప్పుడు జగన్ వద్ద ఉన్న వల్లభనేని వంశీ, జూపూడి ప్రభాకర్ గతంలో ఆయనను విమర్శించారని, ఇప్పుడు  వైసీపీలో చేరారని తెలిపారు. 'వీరసింహారెడ్డి' సినిమాలో బాలకృష్ణ డైలాగులను చూసి తమ పార్టీ నేతలు భుజాలు తడుముకుంటున్నారని ఎద్దేవా చేశారు.
Raghu Rama Krishna Raju
YSRCP
Pawan Kalyan
Janasena
Balakrishna
Chandrababu
Telugudesam

More Telugu News