K.Papa Rao: ‘లోక్‌సత్తా’ జయప్రకాశ్ నారాయణ మామ, ‘వరలక్ష్మి’ పత్తి వంగడం సృష్టికర్త పాపారావు ఇక లేరు!

  • హైదరాబాద్‌లో మృతి చెందిన పాపారావు
  • వ్యవసాయం కోసం 1970లో కర్ణాటకలోని సింధనూరుకు వలస
  • పత్తిపంటకు హెలికాప్టర్లతో మందును పిచికారీ చేయించిన ఘనత
  • రామకృష్ణ హెగ్డే ప్రోద్బలంతో రాజకీయాల్లోకి
  • ‘లోక్‌సత్తా’ జయప్రకాశ్ నారాయణ ఆయన అల్లుడే
varalaxmi cotton seed creator k papa rao passes away

‘వరలక్ష్మి’ పత్తి వంగడం సృష్టికర్త, ఆదర్శ రైతు కె.పాపారావు కన్నుమూశారు. ఆయన వయసు 90 సంవత్సరాలు. నిన్న తెల్లవారుజామున హైదరాబాద్‌లో ఆయన మృతి చెందారు. లోక్‌సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ.. పాపారావుకు స్వయానా అల్లుడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా నరసాయపాలెం నుంచి 1970లో వ్యవసాయం కోసం కర్ణాటక రాష్ట్రం రాయచూరు జిల్లాలోని సింధనూరు వెళ్లిన పాపారావు అనతికాలంలోనే ఆదర్శ రైతుగా పేరు సంపాదించుకున్నారు.

సింధనూరు సమీపంలోని జవళగేరిలో 800 ఎకరాల బీడు భూమిని సస్యశ్యామలం చేసి చూపించారు. తనకున్న పరిజ్ఞానంతో ‘వరలక్ష్మి’ అనే కొత్త పత్తివంగడాన్ని సృష్టించారు. ఆ తర్వాత ఈ రకం పత్తికి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. పత్తిని ఆశించే పురుగు నియంత్రణకు 1985లో హెలికాప్టర్లతో మందును పిచికారీ చేయించి రికార్డులకెక్కారు. తన వద్ద పనిచేసే కూలీల సంక్షేమానికి వ్యవసాయ క్షేత్రం వద్దే ఆసుపత్రి, పాఠశాల నిర్మించారు పాపారావు. 

ఆదర్శ రైతుగా పేరుప్రఖ్యాతులు సంపాదించుకున్న పాపారావు అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి రామకృష్ణ హెగ్డే ప్రోత్సాహంతో రాజకీయాల్లో అడుగు పెట్టారు. 1984లో కొప్పళ నియోజకవర్గం నుంచి జనతా పార్టీ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగారు. ఆయన తరపున ఎన్టీఆర్ కూడా ప్రచారం చేశారు. పాపారావు గెలుపు తథ్యమని అందరూ భావించారు. అయితే, అంతలోనే ఇందిరాగాంధీ హత్యకు గురికావడంతో కాంగ్రెస్‌పై సానుభూతి పెరిగింది. ఫలితంగా ఆ ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు.  

పాపారావుకు ఇద్దరు కుమారులు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుమారులు బెంగళూరులో స్థిరపడ్డారు. పెద్దకుమార్తె రాధారాణిని జయప్రకాశ్ నారాయణ వివాహం చేసుకున్నారు. చిన్న కుమార్తె సంధ్యారాణి ఐఆర్ఎస్ అధికారిణి.

More Telugu News