Basmati Rice: బాస్మతి బియ్యానికి నాణ్యతా ప్రమాణాలను రూపొందించిన కేంద్రం

  • బాస్మతి బియ్యంతో వండే బిర్యానీ ఎంతో ఫేమస్
  • దేశంలో వివిధ రకాల బాస్మతి బియ్యం
  • కల్తీలు, నాసిరకం బాస్మతి బియ్యంపై దృష్టి సారించిన కేంద్రం
  • బియ్యం పొడవు, పరిమళం వంటి అంశాలతో నాణ్యతా ప్రమాణాలు
Center will issue standards for Basmati rice

నోరూరించే కమ్మని బిర్యానీ వండాలంటే బాస్మతి బియ్యం కావాల్సిందే. బిర్యానీకి బాస్మతి బియ్యంతో మరింత రుచి వస్తుందన్నది జగమెరిగిన సత్యం. అయితే బాస్మతి బియ్యంలో కల్తీ జరుగుతోందన్న ఫిర్యాదులపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బాస్మతి బియ్యానికి నాణ్యతా ప్రమాణాలు రూపొందించింది. ఈ మేరకు ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ప్రమాణాలు ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి అమల్లోకి రానున్నాయి. 

నికార్సయిన బాస్మతీ బియ్యం అందించేందుకు వీలుగా ఈ నియంత్రణ ప్రమాణాలు రూపొందించినట్టు ఎఫ్ఎస్ఎస్ఏఐ వెల్లడించింది. ఈ ప్రమాణాలు దేశీయ మార్కెట్లకు, విదేశీ ఎగుమతులకు వర్తిస్తాయని తెలిపింది. ఈ మేరకు ఒరిజినల్ బాస్మతి రకాలుగా బ్రౌన్ బాస్మతి బియ్యం, మర పట్టించిన బాస్మతీ బియ్యం, మర పట్టించిన పారాబాయిల్డ్ బియ్యంను పేర్కొంది. 

వీటిని సహజసిద్ధ పరిమళంతోనే విక్రయాలు జరపాలని, కృత్రిమ రంగులు, పాలిష్ పట్టినట్టు కనిపించేందుకు వాడే రసాయనాలు, కృత్రిమ పరిమళాలు వినియోగించరాదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది. అంతేకాదు, బాస్మతి బియ్యపు గింజ 7 మిమీ కంటే పొడవు ఉండాలని, వండిన తర్వాత అది సగటున 12 మిమీకి పెరగాలని పేర్కొంది. మర పట్టించిన బాస్మతీ బియ్యపు గింజ పొడవు 6.61 మిమీ ఉండాలని, ఉడికించిన తర్వాత 12 మిమీ కంటే పొడవు పెరగాలని నిర్దేశించింది. 

అంతేకాదు, బాస్మతి బియ్యంలో తేమ, అమైలోజ్, యూరిక్ యాసిడ్ శాతం, సగం విరిగిపోయిన బియ్యం, నాన్ బాస్మతీ రకాలు తదితర అంశాలను కూడా తాజా ప్రమాణాల్లో పొందుపరిచింది.

More Telugu News