Andhra Pradesh: నివాసానికి అనుకూలమైన టాప్-10 పట్టణాల్లో ఏపీ నుంచి మూడు

Three Andhra Pradesh cities top in Ease of Living Survey
  • గుంటూరుకు ఆరో ర్యాంక్
  • విజయవాడకు 8, విశాఖకు 9వ ర్యాంకులు
  • సర్వేలో గుంటూరు నుంచి 51 శాతం మంది 
  • కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సర్వే
నివాసానికి సౌకర్యంగా ఉండే పట్టణాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి మూడు దేశవ్యాప్తంగా టాప్-10లో చోటు సంపాదించాయి. గుంటూరు ఆరో స్థానం దక్కించుకుంటే, విజయవాడ 8వ స్థానం, విశాఖపట్నం తొమ్మిదో స్థానంలో ఉన్నాయి. కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ సిటిజన్ పర్సెప్షన్ సర్వే నిర్వహించింది. దేశవ్యాప్తంగా పట్టణ ప్రజల అభిప్రాయాలను ఈ సర్వేలో భాగంగా తెలుసుకున్నారు. 

గుంటూరు పట్టణం నుంచి అత్యధికంగా 3,32,620 మంది సర్వేలో పాల్గొని మద్దతుగా నిలిచారు. 5 లక్షల నుంచి 10 లక్షల జనాభా కేటగిరీలో జాతీయ స్థాయిలో గుంటూరుకు ఆరో ర్యాంక్ లభించింది. విజయవాడ నుంచి 3.32 లక్షల మంది పాల్గొనగా, విశాఖ నుంచి 2.88 లక్షల మంది సర్వేలో అభిప్రాయాలు చెప్పారు. ఈ రెండింటికీ వరుసగా 8, 9వ స్థానాలు లభించాయి. అంతేకాదు, గుంటూరు పట్టణం నుంచి 51.37 శాతం మంది ప్రజలు సర్వేలో పాల్గొనడం ఆరో స్థానం లభించేలా చేసింది. విజయవాడ నుంచి 32.12 శాతం మంది విశాఖ నుంచి 16.72 శాతం చొప్పున ప్రజలు సర్వేలో భాగమయ్యారు. 

జాతీయ స్థాయి ర్యాంకుల్లో థానే, బెంగళూరు, భోపాల్ మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. పింప్రి చించ్వాడ్, మిరా, నవీ ముంబై, కల్యాన్ డోంబివాలి టాప్ 10లో నిలిచిన మిగిలిన పట్టణాలు. గుంటూరు మెరుగైన ర్యాంకును సాధించేందుకు అక్కడి మున్సిపల్ అధికార యంత్రాంగం ముందు నుంచీ చేపట్టిన ప్రత్యేక చర్యలు సత్ఫలితాలను ఇచ్చాయి. ప్రజల్లో సర్వే పట్ల అవగాహన కల్పించి ఎక్కువ మంది పాల్గొనేలా చేశారు. మెరుగైన స్థానం వస్తే అభివృద్ధికి నిధులు వస్తాయనే ప్రణాళికతో అలా చేశారు.
Andhra Pradesh
Ease of Living
Survey

More Telugu News