Nara Lokesh: 'ఛలో కావలి' కార్యక్రమాన్ని ఉక్కుపాదంతో అణచివేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా: నారా లోకేశ్

  • కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై వేధింపులు
  • ఇద్దరి ఆత్మహత్య, మరొకరి ఆత్మహత్యాయత్నం
  • ఛలో కావలికి పిలుపునిచ్చిన టీడీపీ
  • టీడీపీ నేతలను గృహనిర్బంధం చేసిన పోలీసులు
Lokesh condemns Police house arrests TDP leaders in the wake of Chalo Kavali

నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులను నిరసిస్తూ టీడీపీ ఛలో కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంపై తీవ్ర చర్యలు తీసుకున్న పోలీసులు టీడీపీ నేతలను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. దీనిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కావలి నియోజకవర్గంలో ఎస్సీలపై దాడులకు నిర‌స‌న‌గా టీడీపీ ఎస్సీ సెల్ తలపెట్టిన 'ఛ‌లో కావ‌లి' కార్య‌క్ర‌మాన్ని ఉక్కుపాదంతో అణచివేయ‌డాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. 

ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఎంఎస్ రాజుని అరెస్టు చేసిన పోలీసులు ఎటు తీసుకెళుతున్నారో స‌మాచారం ఇవ్వ‌క‌పోవ‌డం రాష్ట్రంలో సైకో పాల‌న‌కి పరాకాష్ఠ అని విమర్శించారు. ఎంఎస్ రాజుతోపాటు అరెస్ట్ చేసిన ఉద్య‌మ‌కారులంద‌రిపై బనాయించిన త‌ప్పుడు కేసులు ఉప‌సంహ‌రించుకుని తక్షణమే విడిచి పెట్టాల‌ని డిమాండ్ చేశారు. 

ఇటీవల ముసునూరుకు చెందిన ఎస్సీ యువకుడు కరుణాకర్ ఆత్మహత్యకు పాల్పడగా, గతంలో పొదలకూరుకు చెందిన నారాయణ అనే దళితుడు వేధింపుల కారణంగా చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇటీవల కావలి తెలుగు యువత నేత పైడి హర్ష వైసీపీ ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాపరెడ్డి ఇంటి ఎదుట పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. 

దళితులపై వేధింపులు పెరుగుతున్నాయంటూ, ఈ ఘటనల నేపథ్యంలో టీడీపీ ఛలో కావలి కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమానికి వామపక్షాలు కూడా మద్దతు పలికాయి. అయితే, అనంతపురం నుంచి వస్తున్న టీడీపీ ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఎంఎస్ రాజును వింజమూరు సమీపంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. 

అటు, ప్రకాశం జిల్లా కొండేపి టీడీపీ ఎమ్మెల్యే డోలా బాలవీరాంజనేయస్వామిని గృహనిర్బంధం చేశారు. గూడూరు మాజీ శాసనసభ్యుడు పాశం సునీల్ కుమార్, నెల్లూరు రూరల్ అసెంబ్లీ ఇన్చార్జి అబ్దుల్ అజీజ్ లను కూడా గృహనిర్బంధం చేశారు. టీడీపీ కావలి నియోజకవర్గ ఇన్చార్జి మాలేపాటి సుబ్బానాయుడిని అరెస్ట్ చేశారు. 

అంతేకాదు, సీపీఎం, సీపీఐ నేతలను కూడా ఈ కార్యక్రమానికి రాకుండా పోలీసులు అడ్డుకున్నారు.

More Telugu News