Pakistan: పాకిస్థాన్ లో దయనీయ పరిస్థితులు... భద్రతా బలగాల పహారాలో గోధుమ పిండి పంపిణీ

Pakistan racing towards huge economic and food crisis
  • పాకిస్థాన్ లో తీవ్రస్థాయిలో ఆర్థిక సంక్షోభం
  • గోధుమపిండి కోసం తొక్కిసలాటలు
  • ఆకాశాన్నంటుతున్న ధరలు
  • రేషన్ దుకాణాల వద్ద సర్వసాధారణంగా మారిన తొక్కిసలాటలు
పాకిస్థాన్ లో అదుపుతప్పిన ద్రవ్యోల్బణం తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసింది. ప్రస్తుతం దాయాది దేశంలో దుర్భర దారిద్ర్యం తాండవిస్తోంది. ప్రభుత్వం పంపిణీ చేసే గోధుమపిండి కోసం తీవ్ర తొక్కిసలాటలు జరుగుతున్నాయి. తన ఆరుగురి సంతానం కడుపు నింపేందుకు ప్రయత్నించిన ఓ వ్యక్తి... పిండి కోసం జరిగిన తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోవడం పాక్ దుస్థితికి అద్దంపడుతోంది. 

సింధ్, బలూచిస్థాన్, ఖైబర్ పంక్తుంక్వా ప్రావిన్స్ లలో రేషన్ దుకాణాలకు ప్రజలు పోటెత్తుతున్నారు. సబ్సిడీపై అక్కడ పంపిణీ చేసే గోధుమపిండే వారికి ఆధారం. దాంతో తొక్కిసలాటలు సర్వసాధారణం అయ్యాయి. అక్కడ భద్రతా బలగాల నీడలో గోధుమపిండి పంపిణీ చేస్తున్నారు. 

పాకిస్థాన్ లో ప్రస్తుతం ధరలు కొండెక్కాయి. గోధుమకు తీవ్ర కొరత ఏర్పడింది. కిలో పిండి రూ.150 పైనే పలుకుతోంది. గతేడాది వచ్చిన భయానక వరదలు కూడా పాక్ ను ఆహార సంక్షోభంలోకి నెట్టివేశాయని ప్రపంచ వాతావరణ సంస్థ చెబుతోంది. 

ప్రస్తుతం పాక్ వద్ద ఉన్న విదేశీ మారకద్రవ్య నిల్వలు 5.8 బిలియన్ డాలర్లు కాగా, అవి మూడు వారాలకే సరిపోతాయని పాక్ సెంట్రల్ బ్యాంకు చెబుతోంది. ఆ తర్వాత ఏంటన్నది అగమ్యగోచరంగా మారింది. ఈ నేపథ్యంలో, పాక్ ఆర్థిక వ్యవస్థ దివాలా తీసేందుకు మరెంతో సమయం పట్టదని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు.
Pakistan
Crisis
Food
Economy

More Telugu News