Dharmana Prasad: రెవెన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం లేదు... ఇక భూములకెక్కడ దొబ్బుతాను!: ధర్మాన

  • శ్రీకాకుళంలో ఓ ప్రారంభోత్సవ కార్యక్రమం
  • హాజరైన మంత్రి ధర్మాన
  • అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని సవాల్
  • తప్పుడు కథనాలు వేస్తున్నారని వ్యాఖ్యలు
Dharmana interesting comments about allegations

తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు శ్రీకాకుళంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పొట్టి శ్రీరాములు మున్సిపల్ మార్కెట్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు.

రెవెన్యూ మంత్రిగా సెంటు భూమి కూడా కేటాయించే అధికారం తనకు ఉండదని, అలాంటిది భూములు దొబ్బే అవకాశం ఉంటుందా? అని వ్యాఖ్యానించారు. రాష్ట్ర క్యాబినెట్ మాత్రమే ఎవరికైనా భూములు కేటాయించగలదని స్పష్టం చేశారు. తాను అవినీతికి పాల్పడినట్టు నిరూపిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని సవాల్ చేశారు. 

"ఈ ప్రభుత్వం అభివృద్ధి చేయడంలేదని ప్రచారం చేస్తుంటారు. కొన్ని టీవీ చానళ్లు మాకు శత్రువులు. ధర్మాన ప్రసాదరావు అవినీతికి పాల్పడ్డాడంటూ ఓ కథనం వేస్తారు... రెవెన్యూ మినిస్టర్ భూములు దొబ్బాడని ఆరోపణలు చేస్తారు. అసలు, రెవెన్యూ మంత్రికి భూములు దొబ్బే అవకాశం ఉంటుందా?

పత్రికల్లో ఇలాంటి ఆరోపణలు చేస్తారు... కానీ అందుకు నేనిచ్చే సమాధానం ఆ పత్రికల్లో రాదు. ఇలాంటివి టీవీల్లో రోజూ చూడడం ద్వారా ప్రజలు ప్రభావితులవుతారు. ఒక్క రూపాయి తీసుకున్నానని నిరూపించినా రాజకీయాల నుంచి తప్పుకుంటానని నేను చెప్పిన మాట ఆ పత్రికల్లో రాదు. నా దగ్గర ఓ రిపోర్టర్ ను పెడతారు... నేను చెప్పినవి అటూ ఇటూ కత్తిరించి మధ్యలో ఉన్న మేటర్ ను పెడతారు. పాపం... ఆ రిపోర్టర్ ఏం చేయగలడు... యాజమాన్యం వద్ద అతడో ఉద్యోగి మాత్రమే!" అంటూ వ్యాఖ్యానించారు.

More Telugu News