Vijayashanti: తప్పుడు ప్రచారం చేసేవారికి ఇంతకు మించి చెప్పాల్సింది ఏమీ లేదు: విజయశాంతి

  • రేవంత్ రెడ్డిపై తన వ్యాఖ్యలను చూసి కొందరు అసంబద్ధ ఊహాగానాలను లేవనెత్తుతున్నారన్న విజయశాంతి
  • రాష్ట్ర నాయకత్వంపై పార్టీ పెద్దలు ఇప్పటికే స్పష్టతనిచ్చారని వ్యాఖ్య
  • రాష్ట్రంలో గెలిచేది బీజేపీనే అని ధీమా
Vijayashanthi comments on those who are diverting her comments

తెలంగాణ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి బీజేపీ నాయకురాలు విజయశాంతి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. టీపీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఎదుర్కొంటున్న ఇబ్బందులపై ఆమె స్పందిస్తూ... పార్టీ నేతలు పీసీసీ అధ్యక్షుడికి ప్రశాంతత లేకుండా చేస్తున్నారని అన్నారు. ఒక నాయకుడు తమను మించి హైలైట్ అవుతాడేమో అనే భయంతో వారిని బయటకు పంపించేంత వరకు శాంతించరని విమర్శించారు. మరోవైపు విజయశాంతి చేసిన ఈ వ్యాఖ్యలపై కొందరు స్పందిస్తూ... రాష్ట్ర బీజేపీలో కూడా నాయకత్వ మార్పు ఉంటుందేమో అని వ్యాఖ్యానిస్తున్నారు. ఈ వ్యాఖ్యలపై విజయశాంతి మండిపడ్డారు. 

టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి రాష్ట్ర కాంగ్రెస్‌లో ఎదుర్కొంటున్న పరిణామాలపై సోషల్ మీడియాలో తన స్పందనను చూసి, బీజేపీలోనూ రాష్ట్ర నాయకత్వ మార్పు జరగబోతోందనే అసంబద్ధ ఊహాగానాలను కొందరు బీజేపీ వ్యతిరేకులు లేవనెత్తుతున్నారని ఆమె మండిపడ్డారు. ఈ అంశంపై తమ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సైతం ఇప్పటికే స్పష్టతనిచ్చారని తెలిపారు. అరకొర సమాచారాన్ని నమ్మి చిలవలు పలవలు చేసి ప్రచారం చేసేవారికి ఇంతకు మించి చెప్పాల్సిందేమీ లేదని వ్యాఖ్యానించారు. రేపటి విజయం బీజేపీది, ఫలితం తెలంగాణ ప్రజలందరిదీ అని అన్నారు.

More Telugu News