Mekapati Chandrasekhar Reddy: నన్ను తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టాడు: మేకపాటి వివరణపై లక్ష్మీదేవి స్పందన

Mekapati Laxmidevi Responds about Chandrasekhar Reddy Comments
  • తనకు 15 ఏళ్ల వయసులోనే కొండారెడ్డితో పెళ్లయిందన్న లక్ష్మీదేవి
  • రెండేళ్లకే కొండారెడ్డి విడిచిపెట్టి వెళ్లిపోయాడని వెల్లడి
  • ఆ తర్వాత చంద్రశేఖర్‌రెడ్డి తన కోసం రెండేళ్లపాటు తమ ఇంటి చుట్టూ తిరిగాడని వ్యాఖ్య
  • అవమానించేలా మాట్లాడడంతోనే బయటకు రావాల్సి వచ్చిందన్న లక్ష్మీదేవి

తనకు ఇద్దరు కుమార్తెలు తప్ప మరెవరూ వారసులు లేరంటూ నెల్లూరు జిల్లా ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి ఇచ్చిన వివరణపై శివచరణ్ రెడ్డి తల్లి లక్ష్మీదేవి స్పందించారు. చంద్రశేఖర్ తనతో 18 ఏళ్లు కాపురం చేశారని, శివచరణ్ రెడ్డిని బాగా చూసుకునే వారని అన్నారు. తనకు 15 ఏళ్ల వయసులో కొండారెడ్డి అనే వ్యక్తితో పెళ్లయిందని అయితే, ఆయనకు ఇష్టం లేకపోవడంతో ఆ తర్వాత రెండేళ్లకే వదిలేసి వెళ్లిపోయాడని గుర్తు చేసుకున్నారు. దీంతో తాను తన పిన్ని ఇంటికి వచ్చానన్నారు. 

ఓ రోజు తన మామ, మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి మాట్లాడుకుంటుండగా తన విషయం చర్చకు వచ్చిందని, తన గురించి చంద్రశేఖర్‌రెడ్డికి చెబుతూ తన మామ బాధపడ్డారని అన్నారు. ఇక, అప్పటి నుంచి చంద్రశేఖరరెడ్డి తనను ఇంటికి తీసుకెళ్తానని, తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి రెండేళ్లపాటు తన ఇంటి చుట్టూ తిరిగాడని అన్నారు. ఇప్పుడేమో డబ్బుల కోసం అబద్ధాలు ఆడుతున్నామని అంటున్నారని లక్ష్మీదేవి ఆవేదన వ్యక్తం చేస్తూ ఓ వీడియోను విడుదల చేశారు.

చంద్రశేఖరరెడ్డి తనను తీసుకెళ్లి బెంగళూరులో కాపురం పెట్టాడని, కుమారుడు శివచరణ్‌రెడ్డిని చక్కగా చూసుకునే వారని లక్ష్మీదేవి గుర్తు చేసుకున్నారు. ప్రస్తుతం ఆయనతో ఉన్న శాంతకుమారి పరిచయం కావడంతో ఇంటికి రావడం తగ్గించారని, విషయం తెలిసి మందలించాక పూర్తిగా రావడం మానేశారని అన్నారు. అప్పటి నుంచి తమను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయన్నారు.

తనను ఇంట్లోంచి తీసుకెళ్లి బజారు పాలు చేసినా ఒక్క మాట కూడా అనలేదని, ఆయన అంతట ఆయనే వచ్చి, ఆయనే వెళ్లారని అన్నారు. ఇప్పుడు అవమానించేలా మాట్లాడడంతో బయటకు రావాల్సి వచ్చిందన్నారు. డబ్బుల కోసం వచ్చామని మాట్లాడడం సరికాదని, ఎవరి వద్ద ఎంత డబ్బుందో వస్తే తెలుస్తుందని అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని లక్ష్మీదేవి ఆ వీడియోలో పేర్కొన్నారు.

  • Loading...

More Telugu News