Ambati Rambabu: సంక్రాంతికి అందరి ఇళ్లకు గంగిరెద్దులు వెళతాయి... చంద్రబాబు ఇంటికి పవన్ వెళ్లారు: అంబటి వ్యంగ్యం

  • చంద్రబాబు నివాసానికి వెళ్లిన పవన్
  • రెండున్నర గంటల పాటు సమావేశం
  • ఇద్దరూ పరామర్శించుకుంటున్నారన్న అంబటి
  • తద్వారా ప్రజలను మోసగిస్తున్నారని విమర్శలు
Ambati satires in Chandrababu and Pawan Kalyan meeting

టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ఇవాళ హైదరాబాదులో సమావేశం కావడంపై ఏపీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో పవన్ కల్యాణ్ ఉన్న హోటల్ కు చంద్రబాబు వెళ్లి పరామర్శించారని, ఇవాళ చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ వెళ్లి పరామర్శించారని వెల్లడించారు. ఇద్దరూ పరస్పరం పరామర్శించుకుంటున్నారని, ఈ పరామర్శలతో ప్రజలను మోసం చేస్తున్నారని అంబటి రాంబాబు విమర్శించారు. 

చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లి పరామర్శించడాన్ని మీడియాలో ఈ ఉదయం నుంచి ఒక ఆశ్చర్యకర పరిణామంగా చూస్తున్నారని, కానీ తనకు ఇందులో ఎలాంటి ఆశ్చర్యకర అంశం కనిపించడంలేదని అన్నారు. ఇదేమీ కీలకమైన భేటీగా భావించడంలేదని పేర్కొన్నారు. తనకే కాదని, వైసీపీకి, కాస్త ఆలోచించేవారికి ఎవరికైనా ఇదేమీ అత్యంత ముఖ్యమైన పరిణామం అనిపించడంలేదని వివరించారు. 

టీడీపీ, జనసేన రెండు వేర్వేరు పార్టీలు అనుకున్నప్పుడే ఇది కీలక భేటీ అవుతుందని, కానీ చంద్రబాబు కోసమే జనసేన పార్టీ పుట్టినప్పుడు ఇది కీలక పరిణామం ఎలా అవుతుందని అంబటి వ్యంగ్యం ప్రదర్శించారు. చంద్రబాబును రక్షించడానికి ఏర్పడిన బి టీమ్ జనసేన పార్టీ అని, పవన్ ఎప్పటికప్పుడు ప్యాకేజి తీసుకుంటూ చంద్రబాబుకు కష్టం వచ్చినప్పుడల్లా కాపాడేందుకు ఏర్పడిన పార్టీ అని తెలిసిన వాళ్లకు వీరిద్దరి భేటీ ఆశ్చర్యకర పరిణామం కాదని ఎద్దేవా చేశారు. 

"చంద్రబాబును భుజాలపై మోస్తూ సీఎంను చేసేందుకు చాకిరీ చేసేందుకు పవన్ కల్యాణ్ వస్తాడని కొన్ని సంవత్సరాల ముందే చెప్పాం. వాళ్లిద్దరూ ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుకోలేదు. నానాటికి పతనమవుతున్న టీడీపీని ఎలా రక్షించుకోవాలన్నదే వారి మధ్య చర్చనీయాంశం అయింది. ఇక్కడ ఆశ్చర్యపోవాల్సింది ఎవరో తెలుసా... బీజేపీ వాళ్లే. పవన్ ఇంకా మాతోనే ఉన్నాడు, పవన్ కల్యాణ్ తో కలిసి పోటీ చేస్తాం, మా పవన్ కల్యాణ్ సీఎం కావాలి, మా పవన్ కల్యాణ్ సీఎం అవుతాడు అనుకునే అమాయకులే ఆశ్చర్యపోవాలి. 

కందుకూరు, గుంటూరు ఘటనల్లో మృతి చెందిన 11 మంది కుటుంబాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించి, జరిగిన ఘటనలు దురదృష్టకరం మమ్మల్ని క్షమించండి అని చెబుతారేమో అని ఆశించిన వాళ్లు ఈ సమావేశం పట్ల ఆశ్చర్యపోవాలి" అని వ్యాఖ్యానించారు. 

అటు, అంబటి ట్విట్టర్ లోనూ చంద్రబాబు, పవన్ భేటీపై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. సంక్రాంతికి అందరి ఇళ్లకు గంగిరెద్దులు వెళతాయని, డూ డూ బసవన్నలా తల ఊపడానికి చంద్రబాబు ఇంటికి పవన్ కల్యాణ్ వెళ్లాడని ఎద్దేవా చేశారు.

More Telugu News