Pawan Kalyan: ఇవాళ చంద్రబాబును కలవడానికి ముఖ్య కారణం ఇదే: పవన్ కల్యాణ్

Pawan Kalyan tells the reason to meet Chandrababu
  • ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం
  • చంద్రబాబు నివాసానికి పవన్ కల్యాణ్ రాక
  • ఇరువురి మధ్య సుదీర్ఘ సమావేశం
  • చంద్రబాబుకు సంఘీభావం తెలిపిన పవన్ కల్యాణ్
జనసేనాని పవన్ కల్యాణ్ ఇవాళ హైదరాబాదులో టీడీపీ అధినేత చంద్రబాబు నివాసానికి వచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబుతో భేటీ ముగిసిన అనంతరం పవన్ కల్యాణ్ మీడియా ఎదుట మాట్లాడారు. ఇవాళ తాను ప్రత్యేకించి చంద్రబాబును కలవడానికి ముఖ్య కారణం మొన్న కుప్పంలో జరిగిన సంఘటన అని వెల్లడించారు. 

వైసీపీ అరాచకాలు, చంద్రబాబును తిరగనివ్వకపోవడం, ఆయనను ప్రజల వద్దకు వెళ్లనివ్వకపోవడం, ఆయన హక్కులను కాలరాయడం, కేసులు పెట్టడం వంటి ఘటనలను చూసి, వాటిపై మీడియా ప్రకటనలు కూడా ఇచ్చానని పవన్ వెల్లడించారు. కుప్పంలో జరిగిన సంఘటనకు సంబంధించి నేడు చంద్రబాబును కలిసి సంఘీభావం తెలిపేందుకు వచ్చానని స్పష్టం చేశారు. 

రాష్ట్రంలో అరాచక పాలన, పెన్షన్లు తొలగింపు, ఫీజు రీయింబర్స్ మెంట్, శాంతిభద్రతలు లోపించడం, రైతులకు గిట్టుబాటు ధర లేకపోవడం, ప్రభుత్వానికి తన బాధ్యతలను గుర్తుచేయడం వంటి అంశాల గురించి తామిరువురం విస్తృతంగా చర్చించుకున్నామని పవన్ కల్యాణ్ వెల్లడించారు. ప్రజలకు వద్దకు వెళ్లి వాళ్ల సమస్యలపై మాట్లాడనివ్వకుండా ఎప్పుడో బ్రిటీష్ కాలం నాటి చట్టం తీసుకురావడం, ప్రత్యర్థి పార్టీలను అడ్డుకునేందుకు ఇలాంటి చెత్త జీవోలు తీసుకురావడాన్ని ఆపాలని బలంగా నిర్ణయించుకున్నామని తెలిపారు. 

ఈ జీవో తీసుకురావడానికి ముందే తనను వైజాగ్ లో అడ్డుకున్నారని, వాహనంలోంచి దిగకూడదు, ప్రజలకు అభివాదం చేయకూడదు, గదిలోంచి బయటకు రాకూడదు అని ఆంక్షలు విధించారని పవన్ తెలిపారు. 

తనకేకాదు, సీనియర్ నేత, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చేసి, నవ్యాంధ్రప్రదేశ్ కు తొలి ముఖ్యమంత్రిగా వ్యవహరించిన చంద్రబాబుకు కూడా ఇలాంటి ఇబ్బందికర పరిస్థితే ఎదురైందని వివరించారు. అందుకే ఆయనకు మద్దతు తెలిపేందుకు వచ్చానని, భవిష్యత్తులో ప్రభుత్వం ఈ జీవోను వెనక్కి తీసుకునేలా చేయడం కోసం ఏంచేయాలన్న దానిపై చంద్రబాబుతో కూలంకషంగా మాట్లాడినట్టు తెలిపారు.
Pawan Kalyan
Chandrababu
Janasena
TDP
Hyderabad
Andhra Pradesh

More Telugu News