Gudivada Amarnath: కోల్డ్ స్టోరేజ్ నేతలంతా ఒక్కచోట చేరి ప్రభుత్వంపై విమర్శలు చేశారు: మంత్రి గుడివాడ అమర్నాథ్

  • విశాఖలో ఉత్తరాంధ్ర చర్చావేదిక సదస్సు
  • హాజరైన వివిధ పార్టీల నేతలు
  • ప్రభుత్వంపై విమర్శల కోసమే సమావేశమయ్యారన్న అమర్నాథ్
  • విశాఖ రాజధాని గురించి ఒక్కరూ మాట్లాడలేదని ఆగ్రహం 
Gudivada Amarnath comments on Uttarandhra Charcha Vedika meeting

ఉత్తరాంధ్ర చర్చా వేదిక కన్వీనర్ కొణతాల రామకృష్ణ అధ్యక్షతన నేడు విశాఖలో సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గిడుగు రుద్రరాజు, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు, జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్, లోక్ సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాశ్ నారాయణ్ తదితరులు హాజరయ్యారు. 

ఈ సమావేశంపై ఏపీ ఐటీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విమర్శనాస్త్రాలు సంధించారు. విశాఖ రాజధానిని ఏకగ్రీవంగా స్వాగతించి, మిగిలిన అంశాలపై చర్చిస్తారేమోనని ఆశించామని, కానీ ఉత్తరాంధ్ర చర్చా వేదిక సదస్సులో విశాఖ రాజధాని ఊసే ఎత్తలేదని ఆరోపించారు. ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్షలకు సంబంధించిన ప్రస్తావనే తీసుకురాలేదని అన్నారు. ఈ సదస్సులో వారు చేసిందంతా రాజకీయ విమర్శలేనని, సీఎం జగన్ ను లక్ష్యంగా చేసుకుని సాగించిన పూర్తిస్థాయి విమర్శలకు ఈ సదస్సు వేదికగా నిలిచిందని అమర్నాథ్ పేర్కొన్నారు. 

"సభాధ్యక్షత వహించిన రామకృష్ణ గారు, తాగుబోతు అయ్యన్న, సహజీవనం చేస్తున్న నాదెండ్ల మనోహర్ గారు, ఉందో లేదో తెలియని కాంగ్రెస్ పార్టీకి నూతన అధ్యక్షులు రుద్రరాజు గారు, చంద్రబాబునాయుడు పార్టీ ఆఫ్ ఇండియా కార్యదర్శిగా ఉన్న రామకృష్ణ (సీపీఎం) గారు... వీళ్లందరూ పెద్ద మనుషులు... కోల్డ్ స్టోరేజి నేతలు! వీళ్లందరూ కలిసి ప్రభుత్వంపై విమర్శలు చేశారు. వీళ్లందరికీ ఉత్తరాంధ్రపై ప్రేమ పుట్టుకొచ్చినట్టుంది. వీళ్లందరి లక్ష్యం చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే. ఎలాగూ సీఎం జగన్ నాయకత్వంలో విశాఖ రాజధాని ఏర్పడుతోంది... అందుకే ఉత్తరాంధ్రలో ఉనికి కోసమే ఈ సదస్సు, ఈ విమర్శలు" అంటూ అమర్నాథ్ ధ్వజమెత్తారు.

More Telugu News