Bandi Sanjay: బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసు

  • కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడి ఘటనలో అరెస్టు
  • అనుచరులు 12 మంది పైనా కేసు పెట్టిన పోలీసులు
  • మరో 25 మంది కోసం గాలింపు 
A Case Has Been Registered Against Telangana BJP Chief Bandi Sanjay

మాస్టర్ ప్లాన్ కు వ్యతిరేకంగా మూడు రోజుల నుంచి కామారెడ్డిలో రైతులు ఆందోళన చేస్తున్నారు. రైతులకు మద్దతుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ శనివారం కామారెడ్డి కలెక్టరేట్ ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో కామారెడ్డిలో ఉద్రిక్తత నెలకొంది. ప్రభుత్వ వాహనం ధ్వంసమైంది. పోలీసులకు, బీజేపీ నాయకులకు మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో బండి సంజయ్ తో పాటు పలువురు బీజేపీ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. 

కామారెడ్డిలో సెక్షన్‌ 30 అమల్లో ఉందని ఎస్పీ శ్రీనివాస్‌ రెడ్డి చెప్పారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. కామారెడ్డి శివారులో మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలనీ రైతులు ఆందోళన నిర్వహిస్తున్నారు.. పొలాల వద్ద నిరసన తెలుపుతున్నారు.

తాజాగా బండి సంజయ్ పై నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. మాజీ ఎమ్మెల్యే రవీందర్ రెడ్డితో పాటు 12 మందిపై పోలీసులు కేసు పెట్టారు. అనుమతి లేకుండా ఆందోళన చేపట్టడం, కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించినందుకు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. కామారెడ్డిలో ఉద్రిక్తతలకు కారణమైన మరో 25 మంది కోసం పోలీసులు గాలిస్తున్నారు.
 
అడ్లూర్‌ ఎల్లారెడ్డిలో శుక్రవారం ఆత్మహత్యకు పాల్పడిన రైతు కుటుంబాన్ని బండి సంజయ్ పరామర్శించారు. అక్కడి నుంచి కలెక్టరేట్ కు వెళ్లి ధర్నా చేయడానికి ప్రయత్నించిన సంజయ్ ను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత నెలకొంది. కలెక్టరేట్ ముందు పెట్టిన బారికేడ్లను బీజేపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. మరికొందరు కలెక్టరేట్‌ గేట్లు ఎక్కి లోపలికి దూకేశారు. వారిని చెదరగొట్టి, బండి సంజయ్ ను పోలీసులు అరెస్టు చేశారు. నిన్న జరిగిన ఈ ఘటనలపై పోలీసులు ఇవాళ కేసు నమోదు చేశారు.

More Telugu News