Chandrababu: నా ప్రచార రథాన్ని దొంగతనం చేస్తారా?.. మీరు పోలీసులా, దొంగలా?: చంద్రబాబు

  • గుడిపల్లిలో చంద్రబాబును అడ్డుకున్న పోలీసులు
  • వ్యాన్ పైకి ఎక్కి ప్రసంగించిన చంద్రబాబు
  • జగన్ కు ఓడిపోతాననే భయం పట్టుకుందన్న బాబు 
Jagan afraid of loosign elections says Chandrababu

పోలీసులను చూస్తుంటే తనకు జాలేస్తోందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. కుప్పం పర్యటనలో ఉన్న ఆయన గుడిపల్లిలోని టీడీపీ కార్యాలయంలోకి వెళ్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. తాను ఎక్కడ మాట్లాడాలో చెప్పాలంటూ పోలీసులను అడిగినా... పోలీసులు మౌనంగా ఉండిపోయారు. దీంతో ఆయన పక్కనే ఉన్న వ్యాన్ పైకి ఎక్కి ప్రసంగించారు. పోలీసులపై ఈ సందర్భంగా నిప్పులు చెరిగారు. 

దొంగమాదిరి తన ప్రచార రథాన్ని ఎత్తుకుపోయిన మీరు పోలీసులా? లేక దొంగలా? అని ప్రశ్నించారు. తన హయాంలో పోలీసులు తీవ్రవాదుల అంతం చూశారని... ఇప్పుడు పోలీసులు ప్రచార రథాలను ఎత్తుకుపోతున్నారని విమర్శించారు. పోలీసుల కుటుంబాలు, పిల్లల కోసం కూడా తానే పోరాడుతున్నానని చెప్పారు. ఒక సైకో ముఖ్యమంత్రి మెడపై కత్తిపెట్టి చేయమంటేనే పోలీసులు చేస్తున్నారని... వారి బానిసత్వాన్ని చూస్తే జాలేస్తోందని అన్నారు. 

జగన్ కు ఓడిపోతాననే భయం పట్టుకుందని... అందుకే నల్ల జీవోలతో విపక్షాలను అణచివేయాలని జగన్ యత్నిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... వాళ్లు తలచుకుంటే గుడ్డలు ఊడదీసి నిలబెడతారని చెప్పారు. వైఎస్ వివేకా హత్య కేసులో జగన్ కు శిక్షపడటం ఖాయమని అన్నారు. గొడ్డలి పోటుతో లేపేసి గుండెపోటు అని చెప్పింది ఎవరో అందరికీ తెలుసని చెప్పారు. 

నా ప్రచార రథాన్ని దొంగతనం చేస్తే పక్కనున్న వ్యాన్ ఎక్కి మాట్లాడుతున్నానని చంద్రబాబు చెప్పారు. నా మైకులను లాక్కుంటే మామూలు మైకుతో మాట్లాడుతున్నానని అన్నారు. ఇక్కడొక పెద్ద మనిషి ఉన్నాడని... వసూళ్లు చేయడమే ఆయన పని అని మంత్రి పెద్దిరెడ్డిని ఉద్దేశించి విమర్శలు గుప్పించారు.

More Telugu News