ashwani v: కష్టాల్లో వొడాఫోన్ ఐడియా.. తక్షణం రూ.7,000 కోట్లు కావాలంటూ బ్యాంకులకు వినతి

  • ఎస్ బీఐ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్, పీఎన్ బీలను కోరిన టెలికాం సంస్థ
  • ఇండస్ టవర్స్ బకాయిలు చెల్లించేందుకే ఈ వినతి
  • రూ.2.2 లక్షల కోట్లకు పెరిగిపోయిన అప్పులు
Voda Idea calls banks for Rs 7000 crores emergency loans

వొడాఫోన్ ఐడియా కష్టాలు మరింత పెరిగిపోయాయి. తక్షణం తనకు రూ.7,000 కోట్ల నిధులు సమకూర్చాలంటూ ఎస్ బీఐ, పీఎన్ బీ, హెచ్ డీఎఫ్ సీ బ్యాంకు, ఐడీఎఫ్ సీ ఫస్ట్ తదితర బ్యాంకులను వొడాఫోన్ ఐడియా కోరింది. ఈ సాయం వ్యాపార కార్యకలాపాల కోసం కాదు. ఇండస్ టవర్స్ కు బకాయిలు చెల్లించేందుకు అని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వర్గాలు తెలిపాయి. 

‘‘నిజమే, వొడాఫోన్ ఐడియా నిధుల కోసం మమ్మల్ని సంప్రదించింది. మేము ఎటువంటి హామీ ఇవ్వలేదు’’ అని ఓ బ్యాంకుకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. వొడాఫోన్ ఐడియాలో ప్రభుత్వం వాటా తీసుకునే విషయంలో స్పష్టత కావాలని బ్యాంకులు కోరినట్టు తెలిసింది. ప్రస్తుతం వొడాఫోన్ ఐడియా అన్ని రకాల రుణాలు కలసి రూ.2.2 లక్షల కోట్లకు చేరాయి. సంస్థ వద్ద కేవలం రూ.190 కోట్ల నిధులే మిగిలి ఉన్నాయి. 2023 సెప్టెంబర్ నాటికి వొడాఫోన్ ఐడియా రూ.9,600 కోట్ల రుణాలను చెల్లించాల్సి ఉంటుంది. 

నిజానికి వొడాఫోన్ ఐడియా సంస్థకు ఇప్పుడు కాగితాలపై ఎలాంటి విలువ లేదు. అంటే నెత్తిన రూపాయి పెట్టినా అర్ధ రూపాయికి కూడా ఎవరూ కొనరు. ఎందుకంటే ఈ సంస్థ నెట్ వర్త్ మైనస్ 76వేల కోట్లకు చేరింది. నెగెటివ్ నెట్ వర్త్ ఉన్న కంపెనీలకు బ్యాంకులు సహజంగా రుణాలు ఇవ్వవు. రుణం పుట్టకపోతే వొడాఫోన్ ఐడియా మూతబడక తప్పని పరిస్థితి. 

మరోవైపు రెండు రోజుల క్రితమే వొడాఫోన్ ఐడియా చైర్మన్ కుమార మంగళం బిర్లా కేంద్ర టెలికాం మంత్రి అశ్వని వైష్ణవ్ తో భేటీ అయ్యారు. దీనిపై మంత్రిని మీడియా ప్రశ్నించగా, ప్రభుత్వం వొడాఫోన్ ఐడియా నుంచి రావాల్సిన బకాయిలను ఈక్విటీగా మార్చుకోవడం ముఖ్యం కాదని, వొడాఫోన్ ఐడియాలోకి నిధులు తీసుకురావడం ప్రాధాన్య అంశంగా చెప్పారు. సంస్థలోకి ప్రమోటర్లు అయిన కుమార మంగళం బిర్లాతోపాటు, వొడాఫోన్ తాజా నిధులను పంప్ చేస్తే, అప్పుడు తన బకాయిలను ఈక్విటీ కింద మార్చుకుంటాననే సంకేతాన్ని ప్రభుత్వం ఇచ్చినట్టు తెలిసింది. ఈ పిరిస్థితుల్లో వచ్చే ఏడాది పాటు వొడాఫోన్ ఐడియాకు జీవన్మరణ సమస్యే కానుంది.

More Telugu News