Born: ఆరు నెలలకే, 400 గ్రాములతో పుట్టిన శిశువుకు ఆయువు పోశారు..!

  • పూణెలో జన్మించిన బుల్లి శిశువు
  • ఇంటెన్సివ్ కేర్ లో మూడు నెలల పాటు సంరక్షణ
  • అనంతరం డిశ్చార్జ్
  • ఇప్పుడు అందరి పిల్లల్లా ఆరోగ్యంగా ఉన్న చిన్నారి
Born at 24 weeks 400gm baby at pune beats all odds

ఆధునిక వైద్య విధానాలు, చికిత్సలతో అసాధ్యం అనుకున్నవి సాధ్యం అవుతున్నాయి. ఇప్పుడు చెప్పుకోబోయే కేసు కూడా అలాంటిదే. ఆరు నెలలకే (24 వారాలు) తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన శిశువు ప్రాణంతో నిలవడం అన్నది వైద్య శాస్త్రంలో అసాధారణమైన విషయమేనని నిపుణులు చెబుతున్నారు. ఈ అసాధ్యమే సుసాధ్యమయ్యింది. 

తొమ్మిది నెలలకు కానీ, శిశువులోని అన్ని అవయవాలు ఏర్పడి అవి కొంత వరకు వృద్ధి చెందవు. అంటే అవయవాలు పూర్తి స్థాయిలో ఎదగకుండానే బయటకు వచ్చిన శిశువును వైద్యులు కాపాడారు. మహారాష్ట్రలోని పూణెలో ఇది సాధ్యమైంది. వాకాడ్ ప్రాంతానికి చెందిన ఈ కేసు వివరాలు వెలుగులోకి వచ్చాయి. చాలా ముందుగా జన్మించిన అతి తక్కువ వయసున్న బేబీగా వైద్యులు చెబుతున్నారు.

గతేడాది మే 21న ఈ బేబీ జన్మించగా, అప్పటి నుంచి 94 రోజుల పాటు శిశువును ఇంటెన్సివ్ కేర్ లో ఉంచి వైద్యులు కాపాడారు. చిన్నారి శివన్య పూర్తిగా ఎదిగినట్టు గుర్తించిన తర్వాత 2022 ఆగస్ట్ 23న డిశ్చార్జ్ చేశారు. ఆ సమయానికి బేబీ బరువు 2,130 గ్రాములకు చేరింది. నిజానికి ఇలా ముందస్తుగా పుట్టిన బేబీలు జీవించే అవకాశాలు అర శాతంలోపే ఉంటాయని వైద్యులు వెల్లడించారు. సాధారణంగా అయితే 37-40 వారాల మధ్య బేబీలు 2,500 గ్రాములు అంతకుమించిన బరువుతో జన్మిస్తుంటారు.

ప్రస్తుతం ఈ బేబీ 4.5 కిలోల బరువుకు చేరుకుంది. అందరి పిల్లల్లా ఆరోగ్యంగానే ఉండడమే కాకుండా, ఆహరం కూడా తీసుకుంటోంది. 750 గ్రాములకంటే తక్కువ బరువుతో జన్మించే పిల్లలను తల్లిగర్భం మాదిరి వాతావరణం మధ్య పెరిగేలా చూసినప్పుడు వారు పూర్తి స్థాయిలో వృద్ధి చెంది జీవించే అవకాశాలు ఉంటాయి. అంతకంటే తక్కువ బరువుతో జన్మించిన పిల్లలను కాపాడడం అంత సులువు కాదు.

More Telugu News