Team India: భారత్ బౌలింగ్ ను చీల్చిచెండాడిన శ్రీలంక... పూణేలో భారీ స్కోరు

  • పూణేలో టీమిండియా, శ్రీలంక రెండో టీ20
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగులు చేసిన లంక
  • షనక, కుశాల్ మెండిస్ అర్ధసెంచరీలు
  • రాణించిన అసలంక, నిస్సాంక
Sri Lanka batsmen hammers Team India bowling in 2nd T20

టీమిండియాతో రెండో టీ20 మ్యాచ్ లో శ్రీలంక బ్యాట్స్ మెన్ విరుచుకుపడ్డారు. భారీ సిక్సర్లతో భారత బౌలర్లను బెంబేలెత్తించారు. పూణేలో జరుగుతున్న ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 206 పరుగుల భారీ స్కోరు సాధించింది. 

శ్రీలంక కెప్టెన్ దసున్ షనక కేవలం 22 బంతుల్లోనే 56 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. షనక స్కోరులో 2 ఫోర్లు, 6 సిక్సులు ఉన్నాయి. అంతకుముందు, చరిత్ అసలంక 19 బంతుల్లోనే 37 పరుగులు చేశాడు. అసలంక 4 సిక్సులు కొట్టాడు. ఓపెనర్ కుశాల్ మెండిస్ 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేయగా, మరో ఓపెనర్ పత్తుమ్ నిస్సాంక 33 పరుగులు సాధించాడు. 

టీమిండియా బౌలర్లలో ఉమ్రాన్ మాలిక్ 3, అక్షర్ పటేల్ 2, యజువేంద్ర చహల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్ లో టీమిండియా బౌలర్లు భారీగా నోబాల్స్ వేసి తగిన మూల్యం చెల్లించుకున్నారు. అర్షదీప్ సింగ్ ఒక్కడే 5 నోబాల్స్ విసిరాడు. అర్షదీప్ 2 ఓవర్లు విసిరి 37 పరుగులు సమర్పించుకున్నాడు. ఉమ్రాన్ మాలిక్ మొదట బాగానే బౌలింగ్ చేసినా, అతడి ఆఖరి ఓవర్లో లంక బ్యాట్స్ మన్ 21 రన్స్ సాధించి పండగ చేసుకున్నారు.

More Telugu News